20-01-2026 12:42:53 AM
అనుచరులతో దురుసు ప్రవర్తన.. పలువురి ఈడ్చివేత
అవమాన భారంతో పుణ్యస్నానమాచరించని స్వామీజీ
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అనుచరుల డిమాండ్
న్యూఢిల్లీ/ వారణాసి, జనవరి ౧౯: జ్యోతిర్మఠ్ పీఠాధిపతి శంకరాచార్యస్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతికి ప్రయాగ్‌రాజ్‌లో అవమానం జరిగింది. మౌని అమావాస్య సందర్భంగా శంకరాచార్య ఆదివారం తన శిష్యగణంతో సంగం తీరంలో పుణ్యస్నానానికి వెళ్లగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. పల్లకీపై వస్తున్న శంకరాచార్యను అడ్డుకుని అమర్యాదగా ప్రవర్తించారు. యువ స్వామీజీలను ఈడ్చివేశారు. కొందరు సాధువుల జుత్తు పట్టుకుని విసిరికొట్టారు. దీంతో అవమానభారంతో శంకరాచార్య పుణ్యస్నానం ఆచరించకుండా వెనుదిరిగారు. దీనిపై శంకరాచార్య మాట్లాడుతూ..
మౌని అమావాస్య సందర్భంగా తాను అనుచరులతో కలిసి ప్రయాగ్‌రాజ్ సంగం తీరంలో పుణ్యస్నానానికి వెళ్లగా, తనను పోలీసులు అడ్డుకున్నారని, తమతో దురుసుగా ప్రవర్తించారని ఆక్షేపించారు. పోలీసులు తన శిష్యులను నెట్టివేశారని, పల్లకీపై వెళ్తున్న తనను మధ్యలోనే ఆపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు సోమవారం వారణాసిలోని అస్సీ ఘాట్ ముముక్షు భవన్ వద్ద దండి సన్యాసులు, స్వామీజీ అనుచరులు నిరాహార దీక్ష చేపట్టారు.
శంకరాచార్యకు సంఘీభావం ప్రకటించారు. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని కోరారు. యూపీ ప్రభుత్వం వెంటనే స్పందించి శంకరాచార్యకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. వారి దీక్షకు కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ నేతలు మద్దతు పలికారు.
బాధ్యులపై చర్యలేవి: కాంగ్రెస్
చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా డిమాండ్ చేశారు. స్వామీజీ అనుచరులతో కలిసి సోమవారం న్యూఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మౌని అమావాస్య సందర్భంగా ఆదివారం ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమంలో పవిత్రస్నానానికి అనుచరులతో వెళ్లిన శంకరాచార్యతో పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారని పేర్కొన్నారు.
ఘటనపై కేంద్రం, యూపీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని పేర్కొన్నారు. యూపీకి చెందిన బీజేపీ నేతలు ఇటు పైసాకు పనికిరారని, అటు రాముడికీ చెందరని (యే నా కామ్ కే హై, నా రామ్ కే హై) అంటూ ఎద్దేవా చేశారు. కొవిడ్ సమయంలో గంగా నదిలో మృతదేహాలు తేలిన అంశాన్ని శంకరాచార్య ప్రశ్నించినందుకే యూపీ ప్రభుత్వం పోలీసులతో ఈ పనిచేయించిందని ఆరోపించారు.
మరోవైపు ఈ అంశంపై పోలీసులు సమాధానమిస్తూ.. నిబంధనల ప్రకారం త్రివేణి సంగమం వద్ద ఎలాంటి వాహనాలకు అనుమతి లేదని, అయినప్పటికీ స్వామీజీ పల్లకీలోనే సంగమం వద్దకు వస్తానని పట్టుబట్టారని, దీంతో అక్కడ తోపులాట జరిగిందని స్పష్టం చేశారు.