మోదీ గెలిచినా, ఓడినా ఆర్థిక విధానం యథాతథం
న్యూఢిల్లీ, మే 28: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరుసగా మూడోదఫా అధికారం చేపట్టినా, లేకపోయినా భారత్ ఆర్థిక విధాన బాటను యథాతథంగా కొనసాగిస్తుందని రిజర్వ్‌బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ రాజన్ చెప్పారు. హాంకాంగ్‌లో జరుగుతున్న యూబీఎస్ ఆసియన్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సుకు హాజరైన రాజన్ మంగళవారం బ్లూంబర్గ్ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటార్వ్యూలో మాట్లాడుతూ ‘ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, ఇప్పటివరకూ జరిగిన మంచిని తీసుకుని, దానిని కొనసాగిస్తుంది’ అని చెప్పారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే బడ్జెట్ ప్రవేశపెడుతుంది. జరుగుతున్న మంచి పనులపై ఆ బడ్జెట్లో దృష్టిపెడతారని, ఎటువంటి మార్పులు చేస్తారన్నది చూడాలని రాజన్ అన్నారు. నరేంద్ర మోదీ తిరిగి అధికారంలోకి వస్తారన్న ఆంచనాలు ఉన్నప్పటికీ, బీజేపీ ఎన్నికల్లో విజయం సాధించకపోతే ఆర్థిక సంస్కరణలు పక్కకుపోతాయన్న ఆందోళనలు ఫైనాన్షియల్ మార్కెట్లలో నెలకొన్న నేపథ్యంలో రాజన్ ఈ వ్యాఖ్యలు చేశారు.






