నాణ్యతపై రాజీ లేదు..
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 21 (విజయక్రాంతి): గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్య, పోషకాహారం, పరిశుభ్రత, విద్యార్థుల ఆరోగ్యంపై ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి జాదవ్ అంబాజీ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన ప్రధానోపాధ్యాయులు, వసతి గృహ అధికారులు, ఎస్సీఆర్పీల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
జిల్లాలోని 52 ఆశ్రమ వసతి గృహాల్లో విద్యార్థులకు ప్రతిరోజూ నాణ్యమైన పోషకాహారం అందించడంతో పాటు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం ప్రతి అధికారి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయులు, వసతి గృహ అధికారులు తప్పనిసరిగా హెడ్క్వార్టర్స్లోనే ఉంటూ విద్యార్థుల చదువు, ఆరోగ్యం, క్రమశిక్షణ, భద్రతపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
ఈ విద్యా సంవత్సరంలో హెచ్‌ఎఫ్‌ఎల్‌ఎన్, లీప్ కార్యక్రమాలను వంద శాతం విజయవంతం చేయాలని, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి నిర్ణీత గడువులో సిలబస్ పూర్తి చేసి పునశ్చరణకు సమయం కేటాయించాలని సూచించారు.జీసీసీ ద్వారా సరఫరా అయ్యే బియ్యం, పప్పులు, ఇతర నిత్యావసర సరుకుల నాణ్యతను పూర్తిగా పరిశీలించిన తర్వాతే స్వీకరించాలని, నాసిరకం సరుకులను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దని స్పష్టం చేశారు.
వసతి గృహాల్లోకి బయటి ఆహార పదార్థాలను పూర్తిగా నిషేధించి, వంటశాలలు, భోజనశాలలు, హాస్టల్ ప్రాంగణాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.విద్యార్థుల ఆరోగ్యం, భద్రత విషయంలో అలసత్వం ప్రదర్శించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.ఈ సమావేశంలో పీఎంఆర్సీ ఏసీఎంఓ పూర్కా ఉద్ధవ్, జిల్లా క్రీడల అధికారి మడావి శేఖు, జీసీడీఓ కె. శకుంతల, ఏటీడీఓలు భాస్కర్ అధికారులు పాల్గొన్నారు.






