24 July, 2026 | 1:45 AM

యూనిఫాం నాణ్యతపై రాజీ లేదు

24-07-2026 12:43 AM
  1. నాణ్యత, సైజు, రంగులపై ప్రతి విద్యార్థి నుంచి ఫీడ్ బ్యాక్
  2. ఆగస్టు 15లోగా అందరికీ యూనిఫాం
  3. హైదరాబాద్‌కు మెరుగైన నీటి సరఫరా
  4.   50 ఏళ్ల అవసరాలకు మాస్టర్ ప్లాన్
  5. ప్రణాళికలు సిద్ధం చేయండి
  6. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం  

హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల్లో చదివే విద్యార్థులకు అందించే యూనిఫాంల నాణ్యతలో రాజీ పడబోమని ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డి స్పష్టం చేశారు. యూనిఫాంల పంపిణీ అనంతరం ప్రతి విద్యార్థి నుంచి వాట్సాప్ ద్వారా ఫీడ్‌బ్యాక్ తీసుకుంటామని సీఎం తెలిపారు. విద్యార్థులు ఇచ్చే అభిప్రాయాల ఆధారంగానే వచ్చే ఏడాది యూనిఫాంల రంగులు, డిజైన్, ఇతర అంశాల్లో మార్పులు చేయనున్నట్లు స్పష్టం చేశారు.

యూనిఫాం పంపిణీపై ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో గురువారం నిర్వహించిన సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. యూనిఫాంల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని తేల్చిచెప్పారు. ఆగ స్టు 15 నాటికి రాష్ర్టంలోని విద్యార్థులందరికీ యూనిఫాంలు అందించాలని, పంపిణీలో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. యూనిఫాం తయారీ, సరఫరా ప్రక్రియను వేగవంతం చేసేందుకు మహిళా సంఘాలతో సమన్వయం పెంచాలని సెర్ప్ సీఈవో దివ్యకు సూచించారు.

వచ్చే విద్యా సంవత్సరంలో జూన్ 2వ తేదీ నాటికే విద్యార్థులకు యూనిఫాంలు అందించేలా ముంద స్తు కార్యాచరణ రూపొందించాలని సీఎం సూచించారు. పేద విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన సేవలు అందించాలని అధికారులకు స్పష్టం చేశారు. సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సు దర్శన్‌రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సబ్యసాచి ఘోష్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్. శ్రీధర్, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. 

గ్రే వాటర్ వినియోగానికి కొత్త నిబంధనలు

భవిష్యత్‌లో పరిశ్రమలు, నిర్మాణ రంగంలో శుద్ధి చేసిన గ్రే వాటర్ వినియోగాన్ని ప్రోత్సహించేలా నిబంధ నలు రూపొందించి అమలు చేయాలని సీఎం సూచించారు. దీని ద్వారా రానున్న రోజుల్లో తాగునీటి వనరులపై ఒత్తిడి తగ్గుతుందని పేర్కొన్నారు. సమీక్ష సమావేశంలో ఎంఏడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ ఎండీ అశోక్ రెడ్డి, జేఎండీ మయాంక్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు. 

క్యూర్ పరిధిలో ఏకీకృత తాగునీటి సరఫరా వ్యవస్థ

కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలో ఏకీకృత తాగునీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మహానగరానికి భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర తాగునీటి సరఫరా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని సూచించారు.  రానున్న 50 ఏళ్ల అవసరాలకు సరిపోయేలా ప్రణాళిక ఉండాలని సూచించారు.

హైదరాబాద్ మహానగర తాగునీటి సరఫరా, సీవరేజీ బోర్డు పరిధిలో జరుగుతున్న పనులపై ఎంసీహెచ్‌ఆర్డీలో గురువారం రాత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.  ఎల్ నినో నేపథ్యంలో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రధాన నీటి వనరులను అనుసంధానం చేయాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ వడు, నాలుగు రోజులకు ఒకసారి తాగునీరు సరఫరా అవుతున్న పరిస్థితిపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇకపై ఇలాంటి పరిస్థితి కొనసాగకూడదని, ఆయా ప్రాంతాల్లో రోజు విడిచి రోజు నీటి సరఫరా అందించేలా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న తాగునీటి సరఫరా ప్రాజెక్టులను ఏడాదిన్నరలోపు పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. సీవరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల (ఎస్టీపీ) నిర్మాణ పనుల పురోగతిని సీఎం సమీక్షించారు. తాగునీటి సరఫరా పనులు, ఎస్టీపీల నిర్మాణ పురోగతిపై ప్రతి నెలా తనకు నివేదిక సమర్పించాలని , ప్రత్యేక డ్యాష్‌బోర్డు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.