05-10-2025 01:08:14 AM
మవోయిస్టులతో ఇక మాట్లాడేందుకు ఏముంది?
బస్తర్ అభివృద్ధికి మావోయిస్టులే అడ్డంకి
మార్చి 31 నాటికి వారిని తుదముట్టిస్తాం
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా
రాయ్‌పూర్, అక్టోబర్ 4: ‘మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపా లని కొందరు కోరుతున్నారు. మేం వారి తో ఎలాంటి చర్చలు జరపం. చర్చల ప్రసక్తే లేదు. వారితో మాట్లాడటానికేముంది? వారు ఆయుధాలు వదిలేసి లొంగిపోయేందుకు సిద్ధంగా ఉంటే మాత్రం స్వాగతిస్తాం’ అని కేంద్ర హోం శాఖ అమిత్ షా స్పష్టం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌లో శనివారం నిర్వ హించిన ‘బస్తర్ దసరా లోకోత్సవ్’, ‘స్వదేశీ మేళా’లో ఆయన మాట్లాడారు.
ప్రభుత్వం ప్రకటించిన పునరావాస పథకాలను మావోయిస్టులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మావోయిస్టులతో చర్చల ప్రతిపాదనను తోసి పుచ్చారు. మావోయిస్టు పార్టీకి ఆకర్షితులై తప్పుదోవ పట్టిన వారిని, జనజీవన స్రవంతిలో కలిసేలా చూడాలని పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది మార్చి 31లోపు ఆ ప్రాంతంలో మావోయిస్టు పార్టీని తుదముట్టిస్తామని పునరుద్ఘాటించారు.
బస్తర్ అభివృద్ధికి మావోయిస్టు పార్టీనే అడ్డంకి అని, మార్చి కల్లా ఆ ప్రాంతాన్ని మావోయిస్టు రహిత ప్రాం తంగా మారుతుందన్నారు. మావోయిస్టులు బస్తర్‌లో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే భద్రతా దళాలు తగిన గుణపాఠం చెప్తాయని హెచ్చరించారు. మావోయిస్టు పార్టీ వల్ల బస్తర్ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని పేర్కొన్నారు.
దేశంలోని ప్రతి గ్రామానికి విద్యుత్, తాగునీరు, రోడ్లు, టాయిలెట్లు, ఆరోగ్య బీమా, రేషన్ బియ్యం వంటి అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని, కానీ.. బస్తర్ ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని వాపోయారు. బీజేపీ ప్రభుత్వం గడిచిన పదేళ్లలో ఛత్తీస్‌గఢ్ అభివృద్ధికి రూ.4 లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించిందని తెలిపారు. మావోయిస్టు పార్టీ బస్తర్ అభివృద్ధిని అడ్డుకోలేదని పేర్కొన్నారు. ఆదివాసీల అభ్యున్నతే బీజేపీ లక్ష్యమని స్పష్టం చేశారు.