05-10-2025 01:06:18 AM
పీవోకేలో సైన్యం కాల్పులపై న్యాయ విచారణకు హామీ
ఇస్లామాబాద్, అక్టోబర్ 4: జమ్మూకశ్మీర్ అప్నీ అమన్ కమిటీ(జేఏఏసీ -జాక్) ప్రతిపాదించిన 38 డిమాండ్లను శనివారం పాకిస్తాన్ ప్రభుత్వం ఆమోదించింది. అలాగే పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో పాక్ సైన్యం జరిపిన కాల్పుల కారణంగా సంభవించిన మరణాలపై న్యాయ విచారణకు, నిర్బంధించిన ప్రదర్శనకారుల విడుదలకు పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకారం తెలిపింది.
అలాగే జమ్మూకశ్మీర్ శరణార్థుల కోసం రిజర్వు చేసిన 12 అసెంబ్లీ సీట్లను రద్దు చేయడంపై ఉన్న చట్టపరమైన సాధ్యాసాధ్యాలను ఉన్నత స్థాయి కమిటీ పరిశీలిస్తుందని తెలియజేసింది. పీవోకేలో అవామీ యాక్షన్ కమిటీ (ఏఏసీ) నేతృత్వంలో కొన్ని రోజులుగా నిరసనలు కొనసాగుతున్నాయి. పీవోకేలో మౌలిక సంస్కరణలు తీసుకురావాలని తమ 38 డిమాండ్లను అమలు చేయాలని ఏఏసీ ఆందోళనలకు పిలుపునిచ్చింది.
దీంతో, భారీ సంఖ్యలో ప్రజలు బయటకు వచ్చి నిరసనల్లో పాల్గొన్నారు. తమ ప్రాథమిక హక్కులను పాకిస్తాన్ హరిస్తోందని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణల్లో 10 మంది మరణించగా, 50 మందికి పైగా జనం గాయపడ్డారు. ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న‘జాక్’, ప్రభుత్వ ప్రతినిధుల మధ్య రెండు రౌండ్ల ఉన్నత స్థాయి చర్చల దరిమిలా పాకిస్తాన్ ప్రభుత్వం దిగివచ్చింది.
సెప్టెంబర్ 29న సమ్మెకు పిలుపునిచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో హింస చెలరేగింది. కాగా, పీవోకేలో కొనసాగుతున్న హింస విషయంలో తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు గతంలో పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ పేర్కొంది. మరోవైపు నిరసనకారులపై పాకిస్తాన్ ప్రభుత్వం అనుసరిస్తున్న అణిచివేత ధోరణిని భారతదేశం తీవ్రంగా విమర్శించింది. ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని ఆరోపించింది.