ఆరోగ్య బీమాలోకి ప్రవేశించే యోచన లేదు: ఎల్‌ఐసీ
న్యూఢిల్లీ, జూన్ 14: ఆరోగ్య బీమా రంగంలోకి ప్రవేశించాలన్న ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని ప్రభుత్వ రంగ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) స్పష్టంచేసింది. జీవిత బీమా వ్యాపారం చేస్తున్న ఎల్‌ఐసీ హెల్ ఇన్సూరెన్స్‌లోకి ప్రవేశించబోతున్న వూహాగానాలు వెలువడటంతో శుక్రవారం సంస్థ ఈ మేరకు స్టాక్ ఎక్సేంజీలకు సమాచారం ఇచ్చింది. వాస్తవానికి ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్‌డీఏఐ నిబంధనల ప్రకారం ప్రస్తుతం జీవిత బీమా కంపెనీలు ఆరోగ్య బీమా పాలసీలను జారీచేయరాదు. జనరల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు మాత్రమే ఆరోగ్య బీమా పాలసీలను విక్రయిస్తాయి.
అయితే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ బీమా చట్టాన్ని సవరించడం ద్వారా కాంపోజిట్ లైసెన్సులు జారీచేస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ లైసెన్సు పొందిన సంస్థ లైఫ్, జనరల్, హెల్త్ పాలసీలు వేటినైనా విక్రయించుకోవచ్చు.దేశంలో బీమాను విస్త్రతపర్చడానికి అన్ని రకాల పాలసీలు ఒకే సంస్థ విక్రయించేలా కాంపోజిట్ లైసెన్సు విధానాన్ని ప్రవేశపెట్టాలంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో ఎల్‌ఐసీ తాజాగా ఇచ్చిన సమాచారంలో వివిధ వ్యూహాత్మక అవకాశాల్ని అన్వేషిస్తున్నామని, వ్యాపారాన్ని విస్తరించేందుకు వ్యూహాత్మక భాగస్వామ్యాలు తదితర ఇన్‌ఆర్గానిక్ వృద్ధి ఆప్షన్లను పరిశీలిస్తున్నామని వివరించింది.






