15 నెలల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ, జూన్ 14: రెండు రోజుల క్రితం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం ఈ ఏడాది మే నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) ఏడాది కనిష్ఠానికి తగ్గినప్పటికీ, టోకు ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) మాత్రం 15 నెలల గరిష్ఠస్థాయికి చేరినట్టు శుక్రవారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ వెల్ల డించింది. దేశంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆహారోత్పత్తుల ధరలు పెరగడం, క్రూడాయిల్, తయారీ ఉత్పత్తుల ధరలు అధికంకావడంతో 2024 మే నెలలో టోకు ద్రవ్యోల్బణం 2.61 శాతానికి చేరింది. 2023 ఫిబ్రవరి తర్వాత ఇదే గరిష్ఠస్థాయి.ఆ నెలలో ఇది 3.85 శాతంగా నమోదయ్యింది. టోకు ధరల ద్రవ్యోల్బణం పెరగడం వరుసగా ఇది మూడవ నెల. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఇది 1.26 శాతంగా నమోదయ్యింది. మే నెల లో ఆహారోత్పత్తులు, ప్యాకేజ్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్, క్రూడ్ పెట్రోలియం, నేచురల్ గ్యాస్, మినరల్ ఆయిల్, ఇతర తయారీ ఉత్పత్తుల ధరలు పెరిగినట్టు వాణిజ్య శాఖ తెలిపింది.
కూరగాయల ధరల మంట
ఈ ఏడాది మే నెలలో ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం 10 నెలల గరిష్ఠస్థాయి 9.82 శాతానికి చేరింది. ఈ బాస్కెట్‌లో కూరగాయల ధరల పెరుగుదల 32.42 శాతంగా ఉన్నది. ఏప్రిల్‌లో ఈ విభాగం ద్రవ్యోల్బణం 23.60 శాతం. ఉల్లి ధరలు 58.05 శాతం, ఆలుగడ్డ ధరలు 64.05 శాతం చొప్పున పెరిగాయి. పప్పు దినుసుల ద్రవ్యోల్బణం మే నెలలో 21.95 శాతం వద్ద నమోదయ్యింది. తీవ్ర వేడిమి కారణంగా ఆహార ద్రవ్యోల్బణం జూన్ నెలలో సైతం గరిష్ఠస్థాయిలోనే కొనసాగుతుందని, రానున్న రుతు పవనాల విస్తరించేతీరుపై ఆహార ద్రవ్యోల్బణం ట్రెండ్ ఉంటుందని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎకనామిస్ట్ అదితి గుప్తా వివరించారు. మరోవైపు అంతర్జాతీయంగా లోహా ల ధరలు పెరగడంతో తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం మే నెలలో 0.78 శాతానికి పెరిగింది.
ఇది ఏప్రిల్ నెలలో మైనస్ 0.42 శాతంగా ఉన్నది. డబ్ల్యూపీఐలో 64 శాతం వెయిటేజి కలిగిన తయారీ ధరల సూచి పెరగడం వరుసగా ఇది నాల్గవ నెల అని, తయారీ కంపెనీల ముడి వ్యయాలు పెరుగుతున్నాయనడానికి ఇది సంకేతమని బార్‌క్లేస్ ఎకానమిస్ట్ శ్రేయా సోధాని చెప్పారు. పెరిగిన వ్యయాలను కంపెనీలు వినియోగ దారులకు మళ్లించనున్నందున టోకు ధరలు ప్రభావం క్రమేపీ రిటైల్ ద్రవ్యోల్బణంలోకి వ్యాపిస్తుందని, ఈ కారణంగా 2024 డిసెంబర్‌లోనే రిజర్వ్‌బ్యాంక్ రేట్ల కోత ఉండ వచ్చని అంచనా వేస్తున్నట్టు సోధాని వివరించారు. జూన్ నెలలో డబ్ల్యూపీఐ 3 శాతానికి పెరగవచ్చని తాము అంచనా వేస్తున్నట్టు ఇక్రా చీఫ్ ఎకానమిస్ట్ అతిది నాయర్ తెలిపారు.






