09-09-2025 12:38:38 AM
రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు
ఉద్యోగ భద్రత కరువే..?
నిర్మల్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిపై విధులు నిర్వహిస్తున్న 104 ఉద్యోగులకు ఆరు నెలల నుంచి వేతనాలు రావడం లేదు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు స్థానికంగానే వైద్యం అందించేందుకు 104 సేవలను 17 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. అప్పట్లో కాంట్రాక్ట్ పద్ధతిపై 104 వాహనాలు పారామెడికల్ సిబ్బందితోపాటు డ్రైవర్లు టెక్నీషియన్లు అటెండర్ల సిబ్బందిని ప్రభుత్వం కాంట్రాక్ట్ పద్ధతిపై నియమించింది.
వీరికి ప్రతినెల ఉద్యోగాన్ని బట్టి వేతనాలు చెల్లిస్తున్నారు ఫార్మసిస్ట్ ల్యాబ్ టెక్నీషియలకు 22,500 ఇతర ఉద్యోగులకు 17,500 వేతనాలు ప్రభుత్వం చెల్లించ వలసి ఉంది. 104 వాహనాలు నిధుల కొరత కారణంగా నిలిచిపోవడంతో ఉమ్మడి ఆదిలాబాద్ మొత్తం 116 మంది 104 ఉద్యోగులను వైద్య ఆరోగ్య శాఖలో విధులను కేటాయించా రు.
వీరు ఎన్సిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇతర ఆరోగ్య సేవలో వినియోగించుకుంటున్నారు డ్రైవర్లను ప్రభుత్వ అధికారుల డ్రైవర్లుగా విధులు నిర్వహిస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో వారి ఉద్యోగ అర్థాన్ని బట్టి కాంట్రాక్ట్ పద్ధతిపై విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గ్రామీణ ప్రాంతాల్లో మీరు పని చేస్తున్నప్పటికీ వీరికి ప్రతి నెల ప్రభుత్వం చెల్లించి వేతనాలు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న 66 ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 104 ఉద్యోగులను సర్దుబాటు చేసి ఆరోగ్య సేవలను అందిపుచ్చుకుంటున్న ప్రభుత్వం వారికి ఆరు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వీరు చేసేది ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగమైన ప్రతినెల వేతనాలు రాక పిల్లల చదువు ఇంటి అద్దె ఆరోగ్య అవసరాలు తీర్చుకునేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
17 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నప్పటికీ తమకు ఉద్యోగ భద్రత లేదని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న తమపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ నిర్వహణ కోసం తాము మారుమూల ప్రాంతాల్లో తమ కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నామని వేతనాలు రాకుంటే తమ పరిస్థితి ఏం కావాల ని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్న వేతనాలను విడుదల చేసి ఆదుకోవాలని వారు కోరుతున్నారు
వేతనాలు రాక ఇబ్బంది
జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో 17 ఏళ్ల నుంచి 104 కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్న. మాకు ఎప్పుడు కష్టాలే ప్రభుత్వ కాంటాక్ట్ ఉద్యోగం కావడంతో ప్రభుత్వం గుర్తించి ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఆశతో ఎదురుచూస్తున్నాం. ప్రస్తుతం ఆరు నెలల నుంచి వేతనాలు రాకపోవడంతో ఇంటి అవసరాల కోసం బయట నుండి నుంచి అప్పులు తెచ్చి సర్దుకు పోతున్నాం అప్పులు కూడా ఎవరు ఇవ్వడం లేదు.
గారిపల్లి రాజేష్, జిల్లా అధ్యక్షులు
పేరుకే ఉద్యోగం
చేసేది ప్రభుత్వ కాంటాక్ట్ ఉద్యోగమైన వేతనాలు రాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం ల్యాబ్ టెక్నికల్ కింద ప్రతినెల 22,500 వేతనం చెల్లించాలి. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న తమకు వేతనాలు రాకపోవడంతో ఇబ్బంది గురవుతున్నాం. 17 ఏళ్ల నుంచి పనిచేయడం వల్ల ప్రభు త్వం ఇప్పటికైనా మాపై శ్రద్ధ తీసుకోవాలి
రావుల శాముల్