09-09-2025 12:41:10 AM
రాజకీయ ఒత్తిళ్లు.. అధికారులు మౌనం
మంచిర్యాల, బెల్లంపల్లి రైతులకు ద్రోహం...
సెలవులో డీఏఓ..! ఏడీఏకు ఇన్‌ఛార్జీ..?
మంచిర్యాల, సెప్టెంబర్ 8 (విజయక్రాం తి) : జిల్లాలో సాగవుతున్న పంటల ఆధారంగా ఆయా నియోజక వర్గాల, మండలాల వారిగా రైతులకు కేటాయించాల్సి ఉంటుం ది. కానీ జిల్లాలో అలా జరగకపోవడంతో కొందరికే ఎరువులు అందుతుండగా మరికొందరు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
సీజన్ ముందుగానే యాక్షన్ ప్లాన్ ఆధారం గా జిల్లాకు ఎరువులు తెప్పించి మండలాలకు పంపాల్సి ఉంటుంది. కానీ సీజన్ ప్రారంభంలో ఉన్న అధికారి తప్పిదం వల్ల చెన్నూర్ నియోజక వర్గానికే ఎక్కువ కేటాయించడంతో ఆ ఎరువులు మొత్తం ముం దుకు ముందే పక్క జిల్లాలకు, పక్క రాష్ట్రాలకు వ్యాపారులు దాటవేశారు.
కేటాయింపుల్లో వ్యత్యాసం...
జిల్లాలోని మూడు నియోజక వర్గాల్లో పంటల సాగుకు ఆధారంగా యూరియా కేటాయించాలి కానీ అప్పటి అధికారి ‘మామూలు’గా తీసుకుంటూ తనకు అనుకూలం గా ఉన్న వారికి పంపించారు. జిల్లా రైతులకు జరుగుతున్న అన్యాయం ఆ అధికారి వెళ్లి కొత్త అధికారి బాధ్యతలు తీసుకున్న తర్వాత రైతుల ఆందోళనలతో భయటపడింది.
సాగులో కీలక దశలో ఉన్న ఈ సమయం లో, రైతులకు అత్యవసరమైన యూరియా సరఫరా విషయంలో జరిగిన అసమానత లు పాలనపై, వ్యవసాయ శాఖ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి.
వ్యత్యాసాలకు ఈ లెక్కలే సాక్ష్యం...
జిల్లాకు వానాకాలం సాగుకు 24,860 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అధికారులు అంఛనా వేశారు. ఇప్పటి వరకు జిల్లాకు కేవలం 20,608 మెట్రిక్ టన్నులు మాత్రమే అందింది. ఇంకా దాదాపు 4250 మెట్రిక్ టన్నుల లోటు ఉంది. ఈ లోటు ఆధారంగా మండలాలకు సమానంగా పంచకపోవడంతో మంచిర్యాల, బెల్లంపల్లి నియో జకవర్గ రైతులకు అన్యాయం జరిగినట్లయింది.
డిప్యుటేషన్ వెనక మర్మమేమిటీ..?
జైపూర్ వ్యవసాయాధికారి మార్క్ గ్లాడిస్టన్‌ను డిప్యూటేషన్ మీద కోటపల్లి మండ లానికి తరలించడం వెనక మర్మమేమిటో అర్థం కావడం లేదు. ఈ డిప్యుటేషన్ ఆర్డర్తో కొత్త వివాదం మొదలైంది. కోటపల్లి మండలానికి ఇప్పటికీ దాదాపు 900 మెట్రిక్ టన్నుల యూరియా లోటుంది.
ఈ సమయంలో జైపూర్లో పని చేస్తున్న మార్క్ గ్లాడిస్టన్ను అకస్మాత్తుగా కోటపల్లికి పంపడం వల్ల మండలం మీద అవగాహన రావడానికే సమయం పడుతదని, దీనితో రైతులకు నష్టం జరుగుతుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సెలవులో డీఏఓ..! ఏడీఏకు ఇంఛార్జీ...?
ఓ వైపు రైతులు ఎరువుల కోసం ఇబ్బం ది పడుతుంటే జిల్లా వ్యవసాయాధికారి ఛత్రూ నాయక్ ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి వ్యక్తి గత కారణాలతో సెలవులో ఉండనున్నట్లు తెలిసింది. ఆయన స్థానంలో గతంలో డీఏఓగా కొద్ది రోజులు పని చేసి జిల్లాను అన్ని రంగాల్లో కుదుటపర్చిన భీమి ని ఏడీఏ సురేఖకు ఇంచార్జీ డీఏఓగా ఉన్నతాధికారులు బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. కష్ట కాలంలో డీఏఓగా వచ్చిన ఛత్రూ నాయక్ సెలవు పెట్టడంతో ఇంచార్జీ అధికారిపై భారం పడుతుందని అధికారులు చర్చించుకుంటున్నారు.
చెన్నూర్‌కే అధిక సరఫరా..
మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఒత్తిడి మేరకే చెన్నూర్‌కు అధికారులు అధికంగా యూరియా కేటాయించినట్లు తెలు స్తోంది. మంచిర్యాల నియోజక వర్గం (దండేపల్లి, హాజీపూర్, మంచిర్యాల, నస్పూర్, లక్షెట్టిపేట) రైతులు సాగు చేసే పంటలకు 6,649 మెట్రిక్ టన్నుల యూరియా అవసరముండగా ఇప్పటి వరకు 4,748 మెట్రి క్ టన్నులు మాత్రమే సరఫరా అయ్యిందంటే 1901 మెట్రిక్ టన్నులు తక్కువ సరఫరా అయ్యింది.
అదే చెన్నూరు నియోజక వర్గం (చెన్నూరు, కోటపల్లి, జైపూ ర్)లో సాగయ్యే పంటలకు 7,917 మెట్రిక్ టన్నుల యూరియా అవసరముండగా ఇప్పటికే 7,431 మెట్రిక్ టన్నులు సరఫరా అయ్యింది. అంటే ఇంకా 486 మెట్రిక్ టన్నులు సరఫరా అయితే కోటా పూర్తయినట్లే. మరోవైపు చెన్నూరు.
మండలానికి అవసరమైన దానికంటే 654 మెట్రిక్ టన్నుల యూరియా అధికంగా సరఫరా జరగడం వెనక రాజకీయ ఒత్తిడి దాగి ఉందనేది చెప్పకనే స్పష్టంగా కనిపించే ఉదాహరణ. వ్యవసాయ శాఖలో ఉండాల్సిన సమానత, నిష్పాక్షికత స్థానంలో రాజకీయ ఒత్తిడి, అధికారుల మౌనం చోటు చేసుకున్నాయి.