calender_icon.png 30 January, 2026 | 10:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓట్ల కౌంటింగ్ కోసం పక్కా ఏర్పాట్లు చేయాలి

30-01-2026 09:37:09 PM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి,(విజయక్రాంతి): మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల విధులలో పాల్గొనే సిబ్బందికి సామాగ్రి డిస్ట్రిబ్యూషన్, ఓట్ల కౌంటింగ్ కోసం పక్కా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ ఆత్మకూరు, అమరచింత లోని మున్సిపల్ కార్యాలయాల్లో  ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల కేంద్రాల్ని సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రిటర్నింగ్ అధికారులు పబ్లిష్ చేసిన ఎన్నికల నోటీస్ ఫామ్ 1  పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణకు నేడు చివరి రోజు అని ఇంక నామినేషన్ వేయాల్సిన వారు ఉంటే ఐదు గంటల లోపు వచ్చి వేయాలని తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నామినేషన్ల స్వీకరణలో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, స్వీకరించిన నామినేషన్లను ఎప్పటికప్పుడు 'టి-పోల్' (T-Poll) వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని అధికారులకు సూచించారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, ఎలాంటి పొరపాట్లు లేకుండా నిర్వహించాలని సూచించారు. హెల్ప్ డెస్క్ లో నామినేషన్లు వేయడానికి వచ్చేవారికి కావాల్సిన సమాచారాన్ని అందించాలని సూచించారు. ఓటర్ జాబితాను కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు. 

కౌంటింగ్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్ పరిశీలన

ఆత్మకూరు పురపాలికకు సంబంధించి ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల, అమరచింత పురపాలికకు సంబంధించి అమరచింత ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో ఏర్పాటు చేయనున్న ఎన్నికల సామగ్రి పంపిణీ, సేకరణ, మరియు ఓట్ల లెక్కింపు  కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కొరకు ఫిబ్రవరి 9వ తేదీ సాయంత్రంలోగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు పూర్తి చేయాలన్నారు.

రూట్ల వారీగా టెంట్లు వేసి వార్డుకో టేబుల్ చొప్పున ఏర్పాట్లు చేయాలని సూచించారు.  విశాల ప్రదేశంలో సులువుగా అర్థమయ్యేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని తెలియజేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలో అవసరమైన అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పటిష్టమైన బారికేడ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్‌ను స్వయంగా పరిశీలించి, భద్రతా పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యాదయ్య, డీఎస్పీ వెంకటేశ్వర్లు మరియు ఇతర రెవెన్యూ, మున్సిపల్ అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు.