calender_icon.png 30 January, 2026 | 11:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన నామినేషన్ల పర్వం

30-01-2026 09:46:53 PM

– మూడో రోజున 122 మంది అభ్యర్థులు 205 నామినేషన్లు దాఖలు

– మూడు రోజుల్లో 36 వార్డులకు 271 నామినేషన్లు

ఆర్మూర్‌,(విజయక్రాంతి): ఆర్మూర్‌ మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన ఘట్టమై నామినేషన్ల స్వీకరణ పర్వం శుక్రవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. మూడో రోజన 122 మంది వివిధ పార్టీల  అభ్యర్థులు 205  నామినేషన్లు దాఖలు చేసారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రానికి పెద్ద ఎత్తున అభ్యర్థులు ర్యాలీలుగా తరలి వచ్చారు. ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి బీజేపీ అభ్యర్థులను, పార్టీ శ్రేణులను వెంట బెట్టుకొని ర్యాలీగా వచ్చి నామినేషన్లు వేయించారు.

ఎన్నికల నోటిఫికేషన్‌లో నామినేషన్ల స్వీకరణకు కేవలం మూడు రోజుల గడువు మాత్రమే ఇవ్వడంతో మొదటి రోజైన బుధవారం రోజున అయిదు నామినేషన్లు దాఖలయ్యాయి. రెండో రోజైన గురువారం 61 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక చివరి రోజున 205  నామినేషన్లు వెల్లువలా వచ్చాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎం, బీఎస్‌పీ, ఆప్, జనసేన, ఎంబీటీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేసారు. ఒక్కో అభ్యర్థి రెండుకు పైగా నామినేషన్‌ పత్రాలను దాఖలు చేసారు.

నామినేషన్లు దాఖలు చేసిన  అభ్యర్థులు బీజేపీ నుంచి 31, బీఆర్‌ఎస్‌ నుంచి 33, కాంగ్రెస్‌ నుంచి 39, ఎంఐఎం నుంచి  ఒకరు, బీఎస్‌పీ నుంచి ఇద్దరు, ఆప్‌ నుంచి నలుగురు, ఎబీటీ నుంచి ఒకరు, జనసేన నుంచి ఇద్దరు, స్వతంత్రులు ఆరుగురు నామినేషన్లు దాఖలు చేసారు. ఆయా పార్టీల అధ్యక్షులు సమర్పించిన ‘బీ’ ఫారంలతో నామినేషన్లు వేసిన అభ్యర్థులు పార్టీ ఖరారు కానుంది. దీంతో మూడు రోజుల్లో 36 వార్డులకు కలిపి మొత్తం 271 నామినేషన్లు వచ్చినట్లు ఆర్మూర్‌ మున్సిపల్‌ కమీషనర్‌ ఉమా మహేశ్వర్‌రావు పేర్కొన్నారు. నామినేషన్ల స్వీకరణ పర్వం ముగియడంతో ఈ నెల 31వ తేదీన ఉదయం 11 గంటల తరువాత నామినేషన్ల స్కూృటినీ నిర్వహించనున్నారు.

స్కూృటినీ అనంతరం ఎన్ని నామినేషన్లు చెల్లుబాటు అవుతాయో ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. అయితే స్కూృటినీలో తిరస్కరించిన నామినేషన్లపై అభ్యంతరాలు తెలపడానికి ఫిబ్రవరి ఒకటిన సాయంత్రం అయిదు గంటల వరకు అవకాశం కల్పించనున్నారు. వచ్చే నెల రెండున  సాయంత్రం అయిదు గంటలలోపు ఈ అభ్యంతరాలను పరిశీలించనున్నారు. వచ్చే నెల మూడున సాయంత్రం మూడు గంటల వరకు ఉప సంహరణల పర్వం కొనసాగనుంది. ఈ లోగా ఆయా పార్టీల అభ్యర్థులు తమ ‘బీ’ ఫారాలు సమర్పించాల్సి ఉంటుంది. అదే రోజు మూడు గంటల అనంతరం మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు.