04-12-2025 02:49:56 PM
జిల్లా ఎన్నికల అధికారి కుమార్ దీపక్
భీమారం, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలో సాధారణ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా 3వ విడత నామినేషన్ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం భీమారం మండలంలోనీ భీమారం, పోలంపల్లి, ఆరేపల్లి గ్రామాలకు భీమారం గ్రామపంచాయతీ, బూర్గుపల్లి, నర్సింగాపూర్ (బి) గ్రామాలకు బూర్గుపల్లి గ్రామపంచాయతీ, దాంపూర్, ధర్మారం, కాజిపల్లి గ్రామాలకు కాజిపల్లి గ్రామపంచాయతీలలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఎంపీడీవో మధుసూదన్, జైపూర్ సిఐ నవీన్ లతో కలిసి సందర్శించి నామినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థులు సమర్పించిన పత్రాలను ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి క్షుణ్ణంగా పరిశీలించాలని, నిర్ణీత గడువు దాటిన తర్వాత వచ్చే నామినేషన్లను తీసుకోకూడదని, రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని కోరారు.
నామినేషన్లు పరిశీలించి అర్హులు, అనర్హుల జాబితా పూర్తి వివరాలతో రూపొందించాలని, ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా నూతన బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించాలని తెలిపారు. ఎన్నికల గుర్తుల కేటాయింపులు జాగ్రత్త వహించాలని, ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలని, హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు అవసరమైన సామాగ్రి జిల్లాలో అందుబాటులో ఉందని, అవసరం మేరకు వినియోగించుకోవాలన్నారు. నామినేషన్ ప్రక్రియ నుంచి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ల పరిశీలన, పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా, పోస్టల్ బ్యాలెట్ పంపిణీ, ఫోటో ఓటర్ స్లిప్పుల పంపిణీ, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు, ఓటింగ్ నిర్వహణ ప్రక్రియ, ఫలితాలు వంటి ప్రతి అంశంపై అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారులు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఖచ్చితంగా పాటించాలన్నారు.
కేజీబీవీని పరిశీలించిన కలెక్టర్...
కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో కొనసాగుతున్న అదనపు గదుల నిర్మాణ పనులను కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత పరిశీలించి ఆహారం తయారీ సమయంలో తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యవసర సరుకులను వినియోగించడంతో పాటు సిబ్బంది పరిశుభ్రత నిబంధనలను పాటించాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.