04-12-2025 02:46:04 PM
న్యూఢిల్లీ: ఏడాదిలో దేశవ్యాప్తంగా సరికొత్త టోల్ వ్యవస్థ(New toll system) అందుబాటులోకి రానుంది. రేడియో ఫ్రీక్వెన్సీ పరికరం ద్వారా టోల్ ఫీజు వసూలుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త వ్యవస్థ ద్వారా టోల్ గేట్ల వద్ద ఆగకుండానే ప్రయాణం కొనసాగించవచ్చని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ(Union Minister Gadkari) తెలిపారు. ఏడాదిలో దేశవ్యాప్తంగా కొత్త టోల్ వ్యవస్థ అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ కొత్త వ్యవస్థను 10 చోట్ల అమలులోకి తెచ్చామని, ఏడాదిలోపు దేశవ్యాప్తంగా విస్తరిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో తెలిపారు.
దేశవ్యాప్తంగా ప్రస్తుతం రూ.10 లక్షల కోట్ల విలువైన 4,500 హైవే ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని గడ్కరీ అన్నారు. ఇటీవల విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (National Payments Corporation of India) భారతదేశంలోని రహదారుల అంతటా టోల్ వసూలును క్రమబద్ధీకరించడానికి ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపుల కోసం ఏకీకృత, ఇంటర్‌ఆపరబుల్ ప్లాట్‌ఫామ్ అయిన నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (National Electronic Toll Collection) ప్రోగ్రామ్‌ను అభివృద్ధి చేసింది. ఎన్ఈటీసీ ప్రధాన అంశం ఫాస్ట్ ట్యాగ్(FASTag), ఇది వాహనం విండ్‌స్క్రీన్‌కు అతికించబడిన రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (Radio-Frequency IDentification) ఆధారిత పరికరం. ఇది ప్లాజా వద్ద ఆగకుండా యూజర్ లింక్డ్ ఖాతా నుండి టోల్ చెల్లింపులను స్వయంచాలకంగా చేయడానికి అనుమతిస్తుంది.