14-12-2025 07:42:33 AM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత గ్రామ పంచాయతీ(Telangana Gram Panchayat Election) ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమై కొనసాగుతోంది. 3,911 పంచాయతీలు, 29,917 వార్డులకు ఆదివారం నాడు పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, అనంతరం ఫలితాలు వెలువడనున్నాయి.
3,911 సర్పంచ్ స్థానాలకు 12,834 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 29,917 వార్డు స్థానాలకు 71,071 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రెండో విడతలో 4,332 సర్పంచ్ స్థానాలకు గానూ 415 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. రెండో విడత వార్డుల్లో38,322కి గానూ 8,304 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. వివిధ కారణాలతో 5 పంచాయతీల్లో నామినేషన్లు దాఖలు కాలేదని అధికారులు వెల్లడించారు. ఎన్నికల కోసం యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.