16 July, 2026 | 10:06 AM

అస్సలు తగ్గలే..

06-12-2024 12:00 AM
  1. నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక, ఫహద్ ఫాజిల్, జగపతిబాబు, రావు రమేశ్, సునీల్, అనసూయ, జగదీశ్ ప్రతాప్ భండారి, అజయ్, శ్రీతేజ్ తదితరులు 
  2. దర్శకత్వం: సుకుమార్ 
  3. నిర్మాత: నవీన్ యెర్నేని, రవి యలమంచలి 
  4. నిర్మాణ సంస్థ: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ 
  5. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ 
  6. విడుదల: 5-11-2024

జపాన్‌లో ఒక మంచి ఫైట్ సీన్‌తో సినిమా ప్రా రంభమవుతుంది. ప్రథమ భాగంలో కూలీగా ఉన్న పుష్ప.. రెండో భాగానికి వచ్చేసరికి ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్‌ను నడిపే నాయకుడిగా ఎదుగుతాడు. బయట కింగ్‌లా ఉండే పుష్ప ఇంట్లో భార్య శ్రీవల్లి (రష్మిక మందన్నా) దగ్గరకు వచ్చే వరకూ ఆమె మాటను జవదాటడు. ఇక ప్రథమ భాగం ముగింపులో భన్వర్‌సింగ్ షెకావత్ (ఫహద్ ఫాజిల్)కు బట్టలిప్పించి గుండు కొట్టిస్తాడు. ఆ పగ రెండో భాగంలో మరింత పతాక స్థాయికి వెళుతుంది. ఎలాగైనా పుష్పను దెబ్బ కొట్టాలని సమ యం కోసం షెకావత్ ఎదురు చూస్తుంటాడు.

మరోవైపు భార్య శ్రీవల్లి చెప్పిందని సీఎంతో ఫోటో తీసుకోవడానికి వెళ్లి పుష్ప భంగపడతాడు. దీంతో ఎమ్మెల్యే సిద్దప్ప నాయుడు (రావు రమేశ్)ని సీఎం చేస్తానని మాట ఇస్తాడు. ఆ తర్వాత కేంద్ర మంత్రి వీర ప్రతాప్ రెడ్డి (జగపతిబాబు) ద్వారా కథ నడిపి సిద్దప్పను సీఎంని చేస్తాడు. తర్వాత కథ ఎలాంటి మలుపు తీసుకుంటుంది. అసలు వీర ప్రతాప్ రెడ్డితో పుష్పకు వైరం ఎందుకు వచ్చింది? వంటి ఆసక్తికర అంశాలతో దర్శకుడు కథను నడిపించాడు.

మెప్పించే అంశాలేంటంటే..?

సినిమాలో గంగమ్మ జాతర సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్‌తో పుష్ప ఛాలెంజ్ చేసి ఎర్రచందనాన్ని సరిహద్దు దాటించడం ఆసక్తికరంగా సాగుతుంది. సినిమాలో పాటలు అన్నీ ఆకట్టుకునేలా ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి. సంగీతం కూడా సినిమాకు మంచి హైప్ ఇచ్చింది. తొలి భాగం ఒక ప్రాంతానికి పరిమితమవగా రెండో భాగాన్ని ఇంటర్నేషనల్ లెవల్‌కి సుకుమార్ తీసుకెళ్లిన తీరు ఆకట్టుకుంటుంది. పుష్ప అంటే ఫైర్ కాదు.. వైల్డ్ ఫైర్ అని డైలాగ్ చెప్పించడమే కాదు.. సినిమాలో పుష్ప పాత్రను కూడా అదే స్థాయిలో సుకుమార్ తీర్చిదిద్దారు.

అల్లు అర్జున్ కూడా ప్రాణం పెట్టి చేశారు. సినిమా ను కేవలం పుష్ప వ్యాపారం చుట్టూ మాత్రమే తిప్పకుండా కాస్త కుటుంబ నేపథ్యంలో డ్రామాను సెకండ్ హాఫ్‌లో నడిపించారు. తొలి భాగంలో పుష్పకు ఇంటి పేరు చెప్పుకో నివ్వకుండా అన్న ఇబ్బంది పెట్టడం వంటి సన్నివేశాలను చూపించిన సుకుమార్ ద్వితీయార్థంలో ఆ భాగాన్ని వదిలే యకుండా ఒక మంచి ముగిం పు ఇచ్చారు. సినిమాకు కిస్సిక్ సాంగ్ కూడా ఒక ప్లస్. ఈ పాటలో శ్రీలీల అద్భుతంగా డ్యాన్స్ చేశారు. ఇక పుష్ప, శ్రీవల్లిల కెమిస్ట్రీ అయితే వేరే లెవల్. వీరిద్దరూ చేసిన పాటలు కూడా జనాల నుంచి మంచి స్పందన పొందుతున్నాయి. దాదాపు అన్ని విభాగాల పని తీరూ బాగుందనే చెప్పాలి.

ఇంకాస్త మెరుగ్గా ఉంటే..

ప్రథమ భాగంలో పగతో రగిలిపోయే షెకావత్‌ను చూ పించారు. ద్వితీయార్ధంలోనూ షెకావత్ పాత్రకు మంచి ఎలివేషన్ ఇచ్చారు. దానిని కొనసాగించి ఉంటే బాగుండేది. షెకావత్ పాత్ర సీరియస్‌నెస్‌ను బాగా తగ్గించేశారు. వారిద్దరి మధ్య సన్నివేశాలు అద్భుతం అయినా కూడా పుష్ప పాత్ర ముందు షెకావత్ పాత్ర తేలిపోయింది. ఇక అనసూయ, సునీల్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యమే లేదు. జగపతిబాబు పాత్రకు పార్ట్ 2లో అయితే అంత ప్రాధాన్యం లేదు. అయితే ‘పుష్ప 3’లో మాత్రం ఆయనే మెయిన్ విలన్ కానున్నట్టు సినిమా చూసిన వారికి ఎవరికైనా అర్థమవుతుంది.

అలాగే కథను కొంచెం సాగదీసి నట్టుగా అనిపిస్తుంది. ఆరంభంలో వచ్చే కథకు, సినిమాకు సంబంధం ఉండదు. పైగా అది పూర్తిగా కూడా చూపించలేదు. బహుశా దీనిని మూడో భాగంలో చూపిస్తారేమో చూడాలి. ద్వితీయార్థంలో షెకావత్‌కి పువ్వు పంపించే సీన్. ఏదో కామెడీ కోసం పెట్టినట్టుంది తప్ప ప్రాధాన్యత కనిపించలేదు. ఇంతకు మించి సినిమాలో బలహీనతలంటూ ఏమీ లేవు. మొత్తంగా సినిమా ‘వైల్డ్ ఫైర్’. 2025 ఎండింగ్‌లో వచ్చినా కూడా ఈ ఏడాదిని తన ఖాతాలో వేసేసుకుంది.