12 June, 2026 | 8:28 PM

నీట్ ఐఐటీ పరీక్షల్లో అవకతవకలపై ఎన్ఎస్‌యుఐ ఆందోళన

12-06-2026 07:23 PM

కరీంనగర్ క్రైమ్: ప్రతిష్టాత్మక ఐఐటి, నీట్ పరీక్షలలో అవకతవకలు జరగడం దేశ ప్రతిష్టకు భంగం కలుగుతుందని, అన్ని పరీక్షల్లో అవకతవకలు జరగడం, నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహించడం విద్యా వ్యవస్థకు సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు & విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు "అల్ఫోర్స్" డా.వి.నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్ వద్ద ఎన్ఎస్‌యుఐ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు ఇమ్రాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ నిరసన ర్యాలీకి కాంగ్రెస్ నేత ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ హాజరై నీట్ పరీక్ష రద్దు చేయడం, మళ్ళీ నిర్వహించడం చాలా అవమానకరమని వారు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ నీట్ పరీక్షను రద్దు చేయడం చాలా అవమానకరమని తెలిపారు. ఇటీవల చాలామంది యువకులు, విద్యార్థులు జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ధర్నాలో సైతం నీట్ మరియు ఐఐటి పరీక్షల రద్దు పట్ల నిర్వహించిన ధర్నా కార్యక్రమం ప్రభుత్వానికి గుణపాఠం లాంటిదని వారు చెప్పారు. సాంకేతిక సమస్యలైన డేటా లభించకపోవడం, సర్వర్ మొరాయించడం, సాంకేతిక లోపాలు అధికంగా ఉండడం, సరైన పర్యవేక్షణ లోపించడం మన విద్యా విధానానికి అడ్డంకిగా మారుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చైనా దేశంలో పరీక్ష పేపర్లు లీక్ చేసిన వారికి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తారని గుర్తుచేశారు.

విద్యార్థులు పేపర్ లీక్ కాలేదని వాదిస్తున్నప్పటికీ పరీక్షలు మళ్ళీ నిర్వహించాలని అనుకోవడం అవమానకరమని చెప్పారు. ఈ సంవత్సరం ఐఐటి అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించారని గుర్తు చేశారు. మొట్టమొదటిసారిగా ఇటీవల జంతర్ మంతర్ వద్ద చేసిన మహా ధర్నా కార్యక్రమం ప్రభుత్వానికి కనువిప్పు కావాలని చెప్పారు. సీబీఎస్ఈ 10వ & 12వ తరగతి ఫలితాల్లో సైతం చాలా అవకతవకలు ఉన్నాయని, పేపర్లు దిద్దడంలో నిర్లక్ష్యం వహించి తప్పులు చేశారని ఆరోపించారు.

ఆన్‌లైన్ పద్ధతిలో పేపర్లను దిద్దినప్పటికీ తప్పులు దొర్లడం అవమానకరమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, ఎస్టీ సెల్ అధ్యక్షులు శ్రావణ్ నాయక్, జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్, సిటీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రజిత రెడ్డి, చింతల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కిమ్ ఫహద్, గుర్రం వాసు గౌడ్, రెహమాన్, రమేష్, విక్రమ్, ఎండి అయాన్, సిహెచ్ చేతన్ రెడ్డి, సోఫియాన్, అన్సారీ, అనిల్, రేవంత్ తదితరులు పాల్గొన్నారు.