వెన్నవల్లి జిపిలో ఘనంగా పోషణ పక్వాడ
తల్లి పాల ప్రాముఖ్యతపై అవగాహన
అక్షరాభ్యాసంతో సందడి
వెన్నవల్లి సర్పంచ్ దంపతులకు ఘన సన్మానం
కల్లూరు,(విజయక్రాంతి): పోషణ పక్వాడ కార్యక్రమం భాగంగా వెన్నవల్లి గ్రామపంచాయతీ పరిధిలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమం ఘనంగా సాగింది.ఈ సందర్భంగా చిన్నారులు,తల్లుల సందడితో అంగన్వాడి కేంద్రం కళకళలాడింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిడిపివో నిర్మలా జ్యోతి,సర్పంచ్ కంభంపాటి లక్ష్మి మాట్లాడుతూ శిశు ఆరోగ్యంలో తల్లి పాల ప్రాముఖ్యత అపారమని పేర్కొన్నారు. శిశువు జననం నుంచి తొలి 1000 రోజులు అత్యంత కీలకమని, ఈ దశలో సరైన పోషణ అందితేనే భవిష్యత్‌లో ఆరోగ్యవంతమైన జీవితం సాధ్యమవుతుందని వివరించారు.
ఆరు సంవత్సరాల లోపు పిల్లల్లో దాదాపు 85 శాతం అభివృద్ధి జరిగిపోతుందని చెబుతూ బాల్యదశకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని చెప్పారు.అంగన్వాడి కేంద్రాల్లో అమలు చేస్తున్న ప్రీ-స్కూల్ కార్యకలాపాలు సమర్థవంతంగా సాగుతున్నాయని అభినందించారు.ఆరోగ్యలక్ష్మి పథకం కింద అందిస్తున్న పోషకాహార భోజనాన్ని తల్లులు తమ పిల్లలకు తప్పనిసరిగా అందించాలని సూచించారు.
ఈ సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించగా,తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ సర్పంచ్ ఖమ్మంపాటి లక్ష్మీవెంకటేశ్వర్ల దంపతులను శుక్రవారం ఘనంగా సన్మానించారు. గ్రామ అభివృద్ధికి వారు అందిస్తున్న సేవలను కొనియాడుతూ కల్లూరు ప్రాజెక్ట్ సిడిపివో నిర్మల జ్యోతి, సూపర్వైజర్ సుజాత ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమంలో సూపర్వైజర్ సుజాత,అంగన్వాడి టీచర్లు ఝాన్సీ,కమల కుమారి, తల్లులు,చిన్నారులు పాల్గొన్నారు.




