ఉద్యాన పంటల పరిశీలన
మెట్ పల్లి,(విజయక్రాంతి): మండలంలోని పలు గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ అధికారి కె. లత శనివారం పర్యటన నిర్వహించి రైతులకు కీలక సూచనలు చేశారు. మండలంలోని చింతలపేట, చౌలమద్ది, రాజేశ్వరరావు పేట గ్రామాల్లో ఉద్యాన పంటల, సాగు పరిశీలించారు. చింతలపేట గ్రామంలో రైతులు తొట్ల మహిపాల్, కొమ్ముల రాజేశ్వర్ రెడ్డి సాగు చేస్తున్న పుచ్చకాయ, ఇప్ప గంగాధర్ పూల తోటల పంటలను పరిశీలించిన ఆమె రైతులు ఒకే పంట కాకుండా ఇలా సీజన్ కు తగిన విభిన్న పంటలు పండిస్తూ ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు.
చౌలమద్ది లో రైతు కనక రాజాం మామిడి తోటను సందర్శించి మామిడి కాయలు చీడపీడల నుండి రక్షించు కోవడానికి ఏర్పాటు చేసిన ఫ్రూట్ కవర్లు పరిశీలించి రైతును అభినందించారు, సస్యరక్షణ చర్యలను వివరించారు. సత్తక్కపల్లి, రాజేశ్వరరావుపెట్, రామలచక్కపేట గ్రామాల్లో రైతుల తోటల్లో ఏర్పాటు చేసిన డ్రిప్ పరికరాలను ఆకస్మిక తనిఖీ చేసి డ్రిప్ వినియోగం పైన రైతులకు అవగాహన కల్పించారు, అలాగే డ్రిప్ పరికరాలు బిగించుటలో ఉన్న లోపాలను గుర్తించి వాటిని సరి చేయవలసిందిగా కంపెనీలను ఆదేశించారు.
రాయితీపైన డ్రిప్ సదుపాయం కలదని ఎస్సి ఎస్టీ రైతులకు తొంబై శాతం సబ్సిడీ సన్నచిన్నకారు రైతులకు ఎనభై శాతం సబ్సిడీ, ఇతర రైతులకు డెబ్భై శాతం సబ్సిడీ కలదని ఆసక్తి గల రైతులు ఉద్యాన శాఖను సంప్రదించాలని సూచించారు. ఈ క్షేత్ర సందర్శనలో కోరుట్ల నియోజకవర్గ ఉద్యాన అధికారి కె. శ్రీనివాస్, ఉద్యాన విస్తరణ అధికారి అన్వేష్, ఇంజినీర్ సాయి కృష్ణ, డ్రిప్ కంపెనీ సిబ్బంది వెంకటేష్, గణేష్ మరియు రైతులు పాల్గొన్నారు.






