calender_icon.png 6 December, 2024 | 3:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగర్ కర్నూల్ జిల్లాలో క్షుద్ర పూజల కలకలం.!

03-11-2024 01:01:36 PM

వివాదంలో ఉన్న పత్తి చేనులో దర్శనం. 

పెద్దల సమక్షంలోనూ పరిష్కారానికి నోచుకోని భూ సమస్య.

అదే పొలంలో క్షుద్ర పూజల ఆనవాళ్ళు 

నాగర్ కర్నూల్ విజయక్రాంతి: నాగర్ కర్నూల్ జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. పచ్చటి పత్తి చేనులో అమావాస్య రోజున అర్ధరాత్రి పసుపు, కుంకుమ, నిమ్మకాయలతోపాటు బొమ్మకు చీలలు గుచ్చి అతి భయంకరంగా జరిపిన క్షుద్ర పూజలు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం తాళ్లపల్లి గ్రామంలోని ఓ రైతు పంట పొలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం తాళ్లపల్లి గ్రామానికి చెందిన రైతు చిలికేశ్వరం పెద్ద తిరుపతయ్య పొలం వివాదాల్లో ఉండగా ఆ పొలంలోనే పత్తి పంటను సాగుచేశారు. చాలాకాలంగా అన్నదమ్ముల మధ్య భూ వివాదం కొనసాగుతుండగా పెద్దలు సమక్షంలోనూ పంచాయతీ పెట్టారు. అయినా వినిపించుకో కుండా ఒకరి మీద ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే గత రెండు రోజుల క్రితం అమావాస్య రోజు అర్ధరాత్రి పచ్చటి పత్తి పంటలో క్షుద్ర పూజలు జరిపి ఉండొచ్చని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఆదివారం ఉదయం పత్తి తీయడానికి వెళ్లే క్రమంలో గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఇంకా భూ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలోనే వారి దాయాదులే క్షుద్ర పూజలకు పాల్పడి ఉంటారని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో ఇలాంటి క్షుద్ర పూజలు తరచూ బయటపడుతూనే ఉన్నాయి. అమావాస్య, పౌర్ణమి దినాలలో మూడు రహదారులు కలిసే ప్రాంతాల్లోనూ క్షుద్ర పూజలు చేసి ఆనవాళ్లు తరచూ దర్శం ఇస్తుంటాయి. జిల్లా పోలీసు ఇతర యంత్రాంగం మూఢనమ్మకాలపై అవగాహన కల్పించకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయని జిల్లా వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.