బస్‌స్టాండ్‌లో ఇబ్బందులు
ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు, ప్రమాదాలు..
సెక్యూరిటి గార్డ్ లేని వైనం..
పట్టించుకోని ఆర్టీసీ అధికారులు..
బాన్సువాడ, మార్చి 9 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ప్రధాన ఆర్టీసీ బస్స్టాండ్ వద్ద పరిస్థితులు రోజురోజుకూ అధ్వాన్నంగా మారుతున్నాయి. బస్స్టాండ్ అవుట్గేట్ వద్ద ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాలు అడ్డంగా నిలబడటంతో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతు న్నాయి. బస్సులు స్టాండ్ నుంచి బయటకు రావాల్సిన మార్గంలోనే ఆటోలు నిర్లక్ష్యంగా తిరుగుతుండటంతో ప్రయాణికుల ప్రాణా లు ప్రమాదంలో పడుతున్నాయి.
బస్స్టాండ్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ ఉన్నప్పటికీ దానిని ఎవరూ పట్టించుకోని పరిస్థితి కనిపిస్తోంది. ఆటో డ్రైవర్లు సిగ్నల్ను లెక్కచేయకుండా ఎక్కడ పడితే అక్కడ నిలబడి ప్రయాణికులను ఎక్కించుకుంటుం డటంతో ట్రాఫిక్ పూర్తిగా గందరగోళంగా మారుతోంది. అత్యంత ఆశ్చర్యక రమైన విషయం ఏమిటంటే, ఇంత పెద్ద బస్స్టాండ్ వద్ద కనీసం ఒక సెక్యూరిటీ గార్డ్ కూడా కనిపించడంలేదు. బస్సులు బయటకు వస్తున్న సమయంలో ప్రయాణికులు రోడ్డుమీదే తిరుగుతుం డటంతో ఎప్పుడైనా ప్రమాదం సంభవించే అవకాశముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిరోజూ వందలాది మంది ప్రయాణికులు ఈ బస్స్టాండ్ను ఉపయోగిస్తున్నప్పటికీ పరిస్థితిని నియంత్రించేలా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి బాన్సువాడ బస్స్టాండ్ వద్ద ట్రాఫిక్ను క్రమబద్ధీకరించి, ఆటోలు, ప్రైవేట్ వాహనాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రైవేట్ వాహనాల నియంత్రణకు చర్యలు తీసుకుంటాం..
బస్టాండ్ ప్రాంతంలో ప్రైవేట్ వాహనాలు ఆటోల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని ఆర్టీసీ డిఎం రవికుమార్ తెలిపారు. ఇప్పటికే డి.ఎస్.పి విట్టల్ రెడ్డి, పట్టణ సీఐ తుల శ్రీధర్ లకు ఫిర్యాదు చేశామని వెంటనే ప్రైవేట్ వాహనాలు బస్టాండ్ ప్రాంతంలో గేటు వద్ద నిలపకుండా చర్యలు తీసుకోవాలని కోరినట్లు డిఎం తెలిపారు.
రవికుమార్, ఆర్టీసీ డిఎం, బాన్సువాడ.




