16 August, 2026 | 10:37 PM

అధికారా.. బినామీ కాంట్రాక్టరా?

14-06-2024 12:55 AM
  • రైతుల పొట్టగొడితే ఊరుకోం..

బీఆర్‌ఎస్ జిల్లా నేత అల్లం ప్రదీప్‌రెడ్డి

జనగామ, జూన్ 13(విజయక్రాంతి): భుగర్భజలాలు అడుగంటిపోయేలా దేవరుప్పుల మండలంలోని చెన్నూరు చెక్‌డ్యాం వద్ద కొందరు ఇసుక తోడుతున్నారని, ఈ విషయంలో ఓ ఇరిగేషన్ అధికారి బినామీ కాంట్రాక్టర్‌లా వ్యవహరిస్తున్నారని, ఆయన తీరుతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని బీఆర్‌ఎస్ నేత అల్లం ప్రదీప్‌రెడ్డి  ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాకేంద్రంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డ్యాం పనుల కోసం రంబోజీగూడెం వాగు నుంచి ఇసుక తరలింపునకు అధికారులు అడ్డుపడుతున్నారన్నారు. 

2021లో చెన్నూరు డ్యాం నిర్మాణానికి టెండర్లు పిలవగా, 2023లో రంబోజీగూడెం వాగులో చెక్ డ్యాం కట్టారన్నారు. ఇరిగేషన్ ఈఈ ప్రవీణ్‌కుమార్ కలెక్టర్‌ను, ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించేలా తహసీల్దార్‌కు లేఖ రాశారని, ఇసుక తవ్వకాల వ్యవహారంలో ఆయన స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. గోదావరి నుంచి జనగామ మీదుగా వందలాది లారీల్లో ఇసుక వెళ్తున్నా, చెన్నూరు డ్యాంకు మాత్రం ఇసుక లభించడం లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్ అధికారులతో పాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ నాయకుడు  ఉసిరిపెల్లి కొండాజీ ఉన్నారు.