19-01-2026 01:16:35 PM
విజయక్రాంతి,పాపన్నపేట: ప్రభుత్వ కార్యాలయానికి ఒకరిద్దరు ఉద్యోగులు ఆలస్యంగా వచ్చారంటే.. ఏవేవో కారణాలు చెబుతుంటారు. ఏకంగా వివిధ శాఖల అధికారులు, దిగువ స్థాయి ఉద్యోగులందరూ ఉదయం 11:30 గంటలు దాటినా కార్యాలయానికి రాకపోతే.. తమ పరిస్థితి ఏంటని వివిధ పనులపై కార్యాలయాలకు వచ్చే ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సమయపాలన పాటించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. సిబ్బంది వివిధ సమయాల్లో రావడంతో ఇబ్బందుల పాలవుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాపన్నపేట అగ్రికల్చర్ కార్యాలయంలో సమయం 12 అవుతున్న కార్యాలయానికి ఏఓ, సిబ్బంది రాకపోవడం గమనార్హం. ఏవో శ్రీనివాస్ రాజు కు ఫోన్ లో సంప్రదించగా 12:10 అవుతున్నా ఇప్పుడు వస్తున్నా కార్యాలయానికి.. మెదక్ లో ఉన్నానని బదులిచ్చారు. ఇద్దరూ ఏఈఓ లకు సంప్రదించగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ నిమిత్తం గ్రామాలకు వచ్చామని సమాధానం ఇచ్చారు. వారి కంటే ముందే కార్యాలయానికి వచ్చిన రైతులు గంటల తరబడి కార్యాలయం ముందు పడిగాపులు కాస్తున్నారు. ఈ విషయమై జిల్లా వ్యవసాయ అధికారి దేవరాజును వివరణ కోరగా.. 12 అవుతున్నా ఏవో కార్యాలయానికి ఇంకా రాకపోవడం ఏంటని.. ఏఈవోలు గ్రామాలకు వెళ్లి ఉండవచ్చని.. వెంటనే మాట్లాడి తగు చర్యలు తీసుకుంటానని సమాధానమిచ్చారు.
ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపమే కారణం..
అధికారులు, కిందిస్థాయి సిబ్బంది సమయపాలన పాటించకపోవడమనేది ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపమే కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు పర్యవేక్షించి తగు చర్యలు తీసుకోవాలని, అధికారులు సమయపాలన పాటించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ప్రజావాణికి గైర్హాజరు..
ప్రతి సోమవారం మండల కేంద్రంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి సైతం అధికారులు గైర్హాజరవుతున్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వ్యవసాయ శాఖ అధికారులతో పాటు ఆయా శాఖల అధికారులు హాజరుకాలేదు. వచ్చిన అధికారులు సైతం ఒక్కొక్కరుగా 11:30 వరకు తాపీగా చేరుకున్నారు.