మనుబోతులగూడెం పోడు భూముల వివాదంపై అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన
అశ్వాపురం, జూలై 20, (విజయక్రాంతి): అశ్వాపురం మండలం మనుబోతులగూడెంలో పోడు భూముల సమస్య నేపథ్యంలో అటవీశాఖ సిబ్బంది, ఆదివాసుల మధ్య ఇటీవల చోటుచేసుకున్న ఘటనపై అధికారులు సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, జిల్లా అటవీశాఖ అధికారి విక్రమ్ సింగ్, ఐటీడీఏ పీవో రాహుల్, ఎఫ్డీవో బాబు తదితర అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు.
ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్తో పాటు గ్రామస్థులను కలిసి ఘటనకు దారితీసిన పరిస్థితులు, జరిగిన పరిణామాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోడు భూముల సమస్య, అటవీ భూముల పరిరక్షణ, ఆదివాసుల జీవనాధారాలకు సంబంధించిన అంశాలపై అధికారులు సమగ్ర సమాచారాన్ని సేకరించారు. ఘటనకు సంబంధించిన వాస్తవాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం అవసరమైన నివేదికను సిద్ధం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.






