పనులపై నిఘా ఎక్కడ?
పర్యవేక్షణ లేని పనులు పట్టించుకోని అధికారులు
తాడ్వాయి, జూన్ 9 (విజయక్రాంతి): గ్రామాల్లోని పేదలకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో గ్రామాలలోని పనులు లేని నిరుపేదలకు పనులు కల్పించి తద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలని సంకల్పించింది. గ్రామాల్లో అవసరమైన పనులు చేపట్టి అందుకు అనుగుణంగా ఉపాధి కూలీలను వినియోగించాలని ప్రభుత్వం ఉద్దేశించింది.
తద్వారా కూలీలకు డబ్బులు అందించి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని ప్రభుత్వం సంకల్పించింది.కానీ అధికారుల నిర్లక్ష్యం, ఉదాసీన వైఖరి కారణంగా పనులు పక్కదారి పడుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో ఉపాధి హామీ పనులు పర్యవేక్షణ లేకుండానే కొనసాగుతున్నాయి. అధికారులు నిర్దేశించిన పనులు ఎలా జరుగుతున్నాయని పర్యవేక్షించకుండానే సంబంధిత టెక్నికల్ అసిస్టెంట్లు ఎంబి రికార్డులు పూర్తి చేసి కూలీలకు డబ్బులు చెల్లిస్తున్నారు. దీంతో చేసిన పనులు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి.
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో ఉపాధి హామీ పథకంలో అధికారులు కాంటూన్ కందకాలు తవ్వాలని నిర్దేశించారు. కందకాలు తవ్వించి ఉపాధి హామీ కూలీలకు కూలి డబ్బులు చెల్లించాలని సంకల్పించారు. కానీ కందకాలు ఎలా తవ్వుతున్నారు, ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఉన్నాయా లేదా అనే కోణంలో అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రధానంగా ఉపాధి హామీలో ఈ సంవత్సరం కాంటూన్ కందకాలు, చెరువులు, కుంటల్లో పూడికతీత పనులు నిర్వహించారు.
పనులు జరిగాయా అంటే జరిగాయి అన్న తీరుగా..
- - ఉపాధి హామీలో పనులు జరిగాయా అంటే జరిగాయి అన్న తీరుగా అధికారులు పనులు నిర్వహిస్తున్నారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో ఈ సంవత్సరం ముఖ్యంగా గ్రామాలలో గ్రామ శివారులోని గుట్టల పక్కన కాంటూన్ కందకాలు తవ్వించారు.కానీ ఈ కందకాలు అధికారులు నిర్దేశించిన విధంగా లేకపోవడంతో వాటి పనితీరు నిరుపయోగంగా మారే అవకాశాలు ఉన్నాయి.
కాంటూన్ కందకాలు ఎందుకు...
గుట్టల పక్కన కాంటూన్ కందకాలు తవ్వించినట్లయితే వర్షానికి వర్షపు నీరు కందకాలలో నిలిచి భూగర్భ జలాలు పెరిగే అవకాశాలు ఉంటాయని ప్రభుత్వం ప్రత్యేకంగా ఉపాధి హామీ పథకంలో కందకాలను తవ్వించడానికి ప్రణాళికలు రూపొందించింది. కానీ కందకాల పరిమాణం అధికారులు నిర్దేశించిన విధంగా లేకపోవడంతో వాటితో ఎలాంటి ఉపయోగం లేకుండా పోతుంది.అధికారులు కందకాలు తవ్వించామంటే తవ్వించాము, కూలీలకు డబ్బులు ఇస్తున్నామంటే ఇస్తున్నామన్న రీతిగా పనితీరు కొనసాగుతుంది.
కందకాల పరిమాణం ఇలా ఉండాలి..
గుట్టల పక్కన తవ్వుతున్న కందకాలు మూడు మీటర్ల పొడవు, ఒక మీటర్ వెడల్పు,అర మీటర్ లోతు ఉండాలి. ఇలా ఉన్నట్లయితే వర్షానికి పడ్డ నీళ్ళు గుట్టలపై నుంచి కిందికి జారుతూ కందకాలలో నిలుస్తుంది. దీంతో భూగర్భ జలాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ కందకాలు అలా ఉండడం లేదు.అర మీటర్ లోతు తవడం లేదు. దీంతో భూగర్భ జలాలు అభివృద్ధి అయ్యే అవకాశాలు లేకుండా పోయాయి. కానీ సదరు ఉపాధి హామీ అధికారుల తీరు భిన్నంగా ఉంది. ఈ కందకాలను పర్యవేక్షించకుండానే ఎంబి రికార్డులు పూర్తి చేసి కూలీలకు డబ్బులు చెల్లిస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఆశయానికి గండి పడుతుంది. చేసిన పనులు లాభం లేకుండా పోతున్నాయి.
వారానికి ఒకసారి పర్యవేక్షించాలి..
ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్లు గ్రామాల్లో జరుగుతున్న పనులను వారానికి ఒకసారి పర్యవేక్షించి కొలతలు తీసుకొని ఎంబి రికార్డులు పూర్తి చేసి కూలీలకు డబ్బులు చెల్లించాలి. కానీ టెక్నికల్ అసిస్టెంట్లు ఎలాంటి కొలతలు తీయకుండానే గ్రామాల్లో పనిచేస్తున్న ఉపాధి హామీ క్షేత్ర సహాయకులతో కొలతలు తీయించి ఎంబి రికార్డులు పూర్తి చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
సంబంధిత టెక్నికల్ అసిస్టెంట్ లే కాకుండా ఉపాధి హామీ ఎపిఓ, ఎంపీడీవోలు సైతం పనులను పర్యవేక్షించాల్సింది కానీ సదరు అధికారులు పనులను ఏమాత్రం పట్టించుకోవడంలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఉపాధి హామీలో జరుగుతున్న పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.






