మక్కల కొనుగోళ్లు బంద్?
గమ్యగోచరంగా రైతుల దుస్థితి మార్కెట్లోకి రానివ్వని అధికారులు
మహబూబాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో మొక్కజొన్న కొనుగోళ్ల వ్యవహారం అగమ్య గోచరంగా మారింది. జిల్లావ్యాప్తంగా లక్షన్నర ఎకరాలకు పైగా విస్తీర్ణంలో యాసంగి సీజన్లో పండించిన పంట ఉత్పత్తులను విక్రయించడానికి రైతులు అష్ట కష్టాలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రైవేటు ట్రేడర్లు క్వింటాలు మక్కలకు 1700 నుండి 1900 రూపాయలు ధర పెడుతుండడంతో, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో 2400 రూపాయల ధర వెళుతుండడం వల్ల రైతులు పెద్ద సంఖ్యలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు మక్కలను తెస్తున్నారు.
దీనితో జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికే వేల బస్తాల మక్కలు అమ్మకాల కోసం తెచ్చి రైతులు నిరీక్షిస్తున్నారు. బస్తాలు లేవని కొద్ది రోజులు, లారీలు లేవని మరికొద్ది రోజులు, ఎండల తీవ్రత వల్ల పగటిపూట పనులు నిలిపివేయడం ఇలా రకరకాల కారణాలతో మక్కల కొనుగోలు వేగవంతం కావడం లేదు.
అలాగే సాగు విస్తీర్ణం, దిగుమతికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం వల్ల జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 21 కొనుగోలు కేంద్రాలు సరిపోక మక్కల కొనుగోళ్ల వ్యవహారం ఇప్పుడు అనిచ్చితి నెలకొంది. జిల్లాలో మహబూబాబాద్, కేసముద్రం వ్యవసాయ మార్కెట్లలో పేరుకుపోయిన వేల బస్తాల మక్కలను ఎగుమతి చేసేంతవరకు కొత్తగా మక్కలను అనుమతించేది లేదని ప్రకటించారు. మహబూబాబాద్ మార్కెట్లో ఇతర వ్యవసాయ ఉత్పత్తులను కూడా నిరవధికంగా బందు చేశారు.
కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో మార్క్ఫెడ్ మక్కల కొనుగోళ్లను నిలిపివేశారు. మార్కెట్లో పేరుకుపోయిన 50,000 బస్తాల మక్కలను ఎగుమతి చేసిన తర్వాతే కొత్తగా కొనుగోళ్లు చేస్తామని ప్రకటించారు. అప్పటివరకు మార్కెట్కు మక్కలు తేకూడదని రైతులకు తేల్చి చెబుతున్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా మండలాల్లో ఏర్పాటు చేసిన మొక్కల కొనుగోళ్ల కేంద్రాల్లో కూడా పరిస్థితి ఇదే విధంగా పరిస్థితి నెలకొంది.
వాతావరణ పరిస్థితులతో గందరగోళం
వాతావరణంలో మార్పుల కారణంగా ఎప్పుడు వర్షాలు కురిసేది.. ఎప్పుడు ఎండలు మండిపోయేది తెలియని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే యాసంగి సీజన్లో పండించిన మక్కల విక్రయాలు పూర్తి కాకపోవడం, మరోవైపు ధాన్యం పంట దిగుబడి చేతికి వస్తుండడంతో రైతులు పండించిన పంటలను విక్రయించడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. అటు మక్కలు, ఇటు ధాన్యం అమ్మకాల కోసం కొనుగోలు కేంద్రాలకు, వ్యవసాయ మార్కెట్లకు తిరుగుతున్నారు.
ఇదే తరుణంలో డీజిల్ కొరత వల్ల వ్యవసాయ పనులకు ఆటంకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట కోతలకు వినియోగించే యంత్రాలకు, ట్రాక్టర్లకు డీజిల్ కొరత పెద్ద సమస్యగా మారిందని, కూలీల కొరత వల్ల యంత్రాలపై ఆధారపడితే ఇప్పుడు డీజిల్ కొరత వల్ల యంత్రాలతో కూడా పని చేయించుకోలేని పరిస్థితి ఏర్పడిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను మరిన్ని ఏర్పాటు చేసి కొనుగోలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని రైతులు కోరుతున్నారు.






