29 April, 2026 | 3:48 AM

ప్రశ్నిస్తే కేసులు పెడతారా?

29-04-2026 02:07 AM
  1. హిట్లర్‌లా ప్రవర్తిస్తున్న సీఎం
  2. మా ఫోన్లనూ హ్యాక్ చేస్తున్నారు
  3. ఐపీఎస్ అధికారులు రిటైర్ అయినా వదలం
  4. బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు
  5. కంది జైలులో బీఆర్‌ఎస్ కార్యకర్తల పరామర్శ

సంగారెడ్డి, ఏప్రిల్ 28(విజయక్రాంతి): ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులు, సిట్‌లతో అణచివేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు దుయ్యబట్టారు. సంగారెడ్డి జిల్లా కందిలోని సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్‌తో పాటు మరో ఏడుగురు కార్యకర్తలను సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌తో కలిసి హరీశ్‌రావు పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫేక్ పోస్టులు పెట్టిన వారిని వదిలేసి, ఆధారాలతో ఫిర్యాదు చేసిన క్రిశాంక్ ను అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ కక్ష సాధింపేనని విమర్శించారు. కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు బెంగళూరు ప్రైవేట్ హ్యాకర్లను కమాండ్ కంట్రోల్ రూమ్‌లో కూర్చోబెట్టి మా ఫోన్లు, ఇళ్ల ముందున్న సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. చట్ట విరుద్ధంగా పనిచేస్తున్న ఐపీఎస్ ఆఫీసర్లను.. రేపు రిటైర్ అయినా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని విచారణ జరిపిస్తామ న్నారు.

రైతులు కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తుంటే రేవంత్‌రెడ్డి వంద కోట్లతో ప్యాలెస్ కట్టుకోవడంలో బిజీగా ఉన్నారన్నారు. సన్నవడ్లకు బోనస్ ఇస్తారో లేదో సీఎం తేల్చాలి.. ఐదారు కిలోల తరుగు తీస్తున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి హిట్లర్ పాలన సాగిస్తున్నాడని తెలిపారు. జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో కూర్చుని నేనే రాజు, నేనే మంత్రి అనుకుంటున్నావు. మీ అరాచకాలను గమనిస్తున్న రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు.

జూబ్లీహిల్స్ ప్యాలెస్ చాలదన్నట్టు ఎంసీఆర్హెచ్‌ఆర్డీలో వంద కోట్లతో కొత్త ప్యాలెస్ కట్టుకుంటున్నాడని తెలిపారు. రైతులు 20 రోజులుగా కొనుగోలు కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తుంటే శనగలు, సన్ ఫ్లవర్ కొనే నాథుడే లేడని వాపోయారు.యాసంగి సన్నవడ్లకు బోనస్ ఇస్తావా? ఇవ్వవా? స్పష్టం చేయాలన్నారు. క్రిశాంక్‌పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని, మళ్లీ పీటీ వారెంట్లు వేసి ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం చూస్తూ  ఊరుకోమని హరీశ్‌రావు హెచ్చరించారు.