19 April, 2026 | 10:34 AM

సోయా పంట బాగు లేదంటూ వెనక్కి పంపిన అధికారులు

02-12-2024 07:45 PM

ఆందోళనలో రైతులు..

జుక్కల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సోయా పంటకు మద్దతు ధర కల్పిస్తూ మద్నూర్ సింగిల్ విండో ఆధ్వర్యంలో నాబార్డు ద్వారా మద్నూర్ మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పటివరకు 20వేల క్వింటాళ్ల సోయా పంట కొనుగోలు జరిగినట్లు ఇటు మార్కెట్ అధికారులు అటు సింగిల్ విండో అధికారుల ద్వారా తెలిసింది. సోమవారం సోయా పంట బాగులేదంటూ ఇక్కడి నుండి బోధన్ గోదాంకి వెళ్ళిన లారీలను అక్కడ పరిశీలన అధికారులు బాగు లేదంటూ 298 బ్యాగులు ఒక లారీలో వెనక్కు పంపడంతో మద్నూర్ మార్కెట్ యార్డులో సోమవారం నాడు రైతులంతా ఆందోళనకు దిగారు.

విండో కార్యదర్శిని ఎందుకు పంట వెనక్కి వచ్చిందని అడిగారు నేను ఏమి చేయలేను. నాకు తేమశాతం పరిశీలించి పంటను కొనుగోలు చేసి ఎక్కడికి పంపాలి అనేది నాబార్డ్ అధికారుల సమాచారం మేరకు బోధన్ గోదాంకు సోయా పంట లోడ్ చేసి పంపించారు. అక్కడ గోదాం అధికారులు పంట బాగులేదంటూ దాదాపు 300 బ్యాగులు మళ్లీ మద్నూర్ మార్కెట్ యార్డ్ కు పంపడం దానికి నేను బాధ్యుణ్ణి కాదని విండో కార్యదర్శి రైతులకు సమాధానం ఇచ్చారు.తమకు ఇటు రైతులు ఒత్తిళ్లు అటు జిల్లా అధికారులతో ఒత్తిళ్లు భరించలేని పరిస్థితి కొనసాగుతుందని, పంట బాగుకోసం నాబార్డ్ అధికారులు ఇక్కడ ఉండి పరిశీలన జరుపుకుంటే రైతుల నుండి తమకు ఎలాంటి ఆరోపణలు రావని విండో కార్యదర్శి వాపోయారు. ఏది ఏమైనా మద్దతు ధర సోయా పంట కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా ఇటు సింగిల్ విండో అధికారులు గానీ అటు నాబార్డు అధికారులు గానీ సహకరించాలని, సోయా పంట రైతులు సంబంధిత శాఖల అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.