02-02-2026 02:05:46 AM
అధికారులకు స్వయంగా మీరే ఆదేశాలిచ్చారా
ఎప్పటి నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్?
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఎలా బయటకు వచ్చింది
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి) : ఫోన్ ట్యాపింగ్ కేసు వెనుక ఉన్న పెద్దాయన మీరేనా? అని మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం. ఈ విచారణలో భాగంగా సిట్ అధి కారులు కేసీఆర్‌ను నేరుగా ప్రశ్నించారు. ‘ఫోన్ ట్యాపింగ్ చేయమని ఇంటెలిజెన్స్ అధికారులకు మీరు స్వయంగా ఆదేశాలు జారీ చేశారా?’ అనే ప్రశ్నను స్పష్టంగా అడిగినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై కేసీఆర్ నుంచి క్లారిటీ తీసుకునేందుకు సిట్ అధికారులు తీవ్రంగా ప్రయత్నించినట్లు సమా చారం.
ఏ సంవత్సరం నుంచి ఫోన్ ట్యాపిం గ్ మొదలైంది?, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎప్పటి నుంచి ప్రారంభమైందనే విషయంపై సిట్ అధికారులు ప్రత్యేకంగా ఆరా తీసినట్టు అధికారవర్గాల ద్వారా తెలిసింది. మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ఆరుగురు సిట్ అధికారల బృందం ఆదివారం సుదీర్ఘంగా విచారించింది. హైదరా బాద్‌లోని నందినగర్ నివాసంలో మధ్యా హ్నం 3 గంటల నుంచి ప్రారంభమైన ఈ విచారణలో కేసీఆర్‌కు సిట్ అధికారులు పలు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం.
కేసీఆర్‌ను నాలుగున్నర గంటలకుపైగా ప్రశ్నించారు. గతంలో సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా కేసీఆర్‌ను సిట్ అధికా రులు ప్రశ్నించారు. కేసీఆర్ ఎదుట ఆధారాలు ఉంచి ప్రశ్నలు అడిగినట్టు తెలిసింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై ఆడియోలు ఎలా వచ్చాయనే అంశంపై సిట్ సుదీర్ఘంగా విచారణ చేపట్టింది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ ఆదేశాలు ఎవరి సూచనలతో జారీ అయ్యాయన్న విషయంపై, నిర్ణ య ప్రక్రియలో కేసీఆర్ పాత్రపై సిట్ అధికారులు ప్రత్యేక దష్టి సారించినట్లు తెలుస్తోంది.
విచారణ సమయంలో ఆ ముగ్గురు అక్కడే...
కేసీఆర్ వయస్సు, భద్రతా కారణాల దష్ట్యా, సిట్ అధికారులు ఆయన నివాసంలోనే విచారణ జరిపారు. ఈ విచారణ సమయంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోశ్‌రావు, న్యాయ నిపుణులు నందినగర్ నివాసంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. మాదాపూర్ డీసీపీ రీతిరాజ్, ఐపీఎస్ విజయ్‌కుమార్, ఐపీఎస్ నారాయణరెడ్డి, అడిషనల్ ఎస్పీలు అరవింద్‌కుమార్, కేఎస్‌రావు కేసీఆర్‌ను ప్రశ్నిం చారు. విచారణకు ముందే కేసీఆర్ నివాసానికి చేరుకున్న సిట్ అధికారులు బిల్డింగ్‌లోని రెండో అంతస్తులో ఒక గదిలో విచారణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
విచారణ సమయంలో కేసీఆర్ వెంట ఒకరు ఉండేందుకు అవకాశం ఉంది. దీంతో గులా బీ బాస్ వెంట మాజీ ఎంపీ సంతోశ్ రావు ఉంటారని బీఆర్‌ఎస్ లీగల్ టీమ్ సిట్‌కు సమాచారం అందజేసింది. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ నుంచి వచ్చిన కేసీఆర్ తన వెంట ఒక నోట్ బుక్, పలు డాక్యుమెంట్లు తెచ్చుకున్నారు. ఇక తన వెంట తెచ్చిన డాక్యుమెంట్లలో ఏముందనేది ఉత్కంఠగా మారిం ది. అయితే ఈ కేసులో ఇప్పటికే పలువురు అధికారులతో పాటు బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు, కేసీఆర్ కుటుంబ సభ్యులైన కేటీఆర్, హరీశ్ రావు, సంతోశ్ రావును సిట్ ప్రశ్నించింది.
విచారణ అనంతరం అభిమానులకు కేసీఆర్ అభివాదం...
రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణ ముగిసింది. హైదరాబాద్‌లోని నందినగర్‌లో ఉన్న నివాసంలో రెండో అంతస్తులోని ఓ గదిలో నాలుగున్నర గంటలకు పైగా సిట్ అధికారులు కేసీఆర్‌ను విచారించారు. కేసులో నిందితులుగా ఉన్న వారి స్టేట్మెంట్ ఆధారంగా కేసీఆర్‌ని సిట్ బృందం విచారించింది.
సిట్ విచారణ అనంతరం తెలంగాణ భవన్ నుంచి నందినగర్‌కు బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీగా నంది నగర్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఇంటి నుంచి బయటకు వచ్చారు. అప్పటికే నివాసం వద్దకు తరలి వచ్చిన బీఆర్‌ఎస్ శ్రేణులకు కేసీఆర్ అభివాదం చేశారు. దీంతో జై కేసీఆర్, జై తెలంగాణ, సీఎం.. సీఎం అంటూ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు బయలుదేరారు.
కేసీఆర్‌కు బీఆర్‌ఎస్ శ్రేణుల నీరాజనం...
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ఎదుర్కొనేందుకు కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. భారీ కాన్వాయ్‌తో కేసీఆర్ నందినగర్ నివాసానికి చేరుకున్నారు. కేసీఆర్ రాక నేపథ్యంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్దకు పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు ఆయన బాల్య మిత్రుడు, పార్టీ సీనియర్ నాయకుడు జహంగీర్ మహమ్మద్ రక్షణ చిహ్నం ఇమామె జామిన్ కట్టారు. అనంతరం రోడ్డుమార్గంలో బయలుదేరిన కేసీఆర్.. అభిమానులకు అభివాదం చేశారు.
కేసీఆర్ కాన్వాయ్ వెంట పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు వాహనాల్లో బయలు దేరారు. మార్గం మధ్యలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు కేసీఆర్ కాన్వాయ్‌పై పూల వర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కేసీఆర్ విచారణ నేపథ్యంలో నందినగర్ నివాసం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇక్కడ 4 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లే దారులన్నింటిని పోలీసులు మూసివేశారు.
ఎప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్
‘ఏ సంవత్సరం నుంచి ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పారు?, అది సాధారణ భద్రత కోసమా? లేక రాజకీయ అవసరాల కోసమా?’ అంటూ పలు అనుబంధ ప్రశ్నలు వేసినట్లు సమాచారం. ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేశారా?, ఈ విచారణలో అత్యంత కీలకంగా మారిన ప్రశ్న ఇదేనని చెబుతున్నారు. ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేయమని ఆదేశాలు ఇచ్చారా? అంటూ సిట్ అధికారులు నేరుగా ప్రశ్నించారని సమాచారం. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు వ్యవహారం కూడా సిట్ అధికారుల విచారణలో ప్రధాన అంశంగా మారింది.
పదవీకాలం ముగిసిన ప్రభాకర్ రావుకు మళ్లీ పదవిని ఎందుకు పొడిగించారు? ఆ నిర్ణయం వెనుక కారణాలు ఏంటి? అంటూ కేసీఆర్‌ను సిట్ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. ఒకే వ్యక్తికి రెండు కీలక పోస్టులు ఎందుకు? పరిపాలనా నియమావళికి విరుద్ధంగా ఒకే వ్యక్తికి రెండు కీలక బాధ్యతలు అప్పగించడంపై కూడా సిట్ అధికారులు ప్రశ్నలు సంధించారు. ఒకే వ్యక్తికి రెండు కీలక పోస్టులు ఎందుకు అప్పగించారు?, అది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో సంబంధం ఉందా? అనే కోణంలో విచారణ సాగినట్లు సమాచారం.
ఆ విషయం ట్యాపింగ్ ద్వారానే తెలిసిందా...
ఎమ్మెల్యే కొనుగోలు కేసు సమయంలో తీసుకున్న చర్యలపై కూడా సిట్ అధికారులు ప్రశ్నించారు. ‘మీ పార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీలకు వెళ్తున్నారని మీకు ఎలా తెలిసింది?, ఆ సమాచారం ఫోన్ ట్యాపింగ్ ద్వారానే వచ్చిందా? అన్న అనుమానాలతో అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. పార్టీ ఫండ్‌తో ఫోన్ ట్యాపింగ్ పరికరాల కొనుగోలు? చేశారా అని సెట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ఈ విచారణలో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది.
ఫోన్ ట్యాపింగ్ పరికరాల కొనుగోలుకు పార్టీ ఫండ్‌ను కేటాయించారా? ప్రభుత్వ నిధులు కాకుండా పార్టీ డబ్బులు ఎందుకు ఉపయోగించారు? అంటూ సిట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ‘మీ పార్టీకీ ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చిన వారి ఫోన్ నంబర్లు ట్యాపింగ్ లిస్ట్‌లో ఎందుకు ఉన్నాయి?, ఈ ప్రశ్నపై కేసీఆర్ వివరణ కోరుతూ సిట్ అధికారులు తీవ్రంగా విచారణ చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? ఎలాంటి అధికారిక ఫైళ్లు ఉన్నాయి? భద్రతా కారణాల పేరుతో రాజకీయ ప్రయోజనాల కోసం ట్యాపింగ్ జరిగిందా? అన్న అంశాలపై సిట్ అధికారులు సమగ్ర విచారణ జరిపినట్లు తెలుస్తోంది.
గులాబీ బాస్ భావోద్వేగం...
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ భాగంగా నందినగర్‌లోని ఆయన నివాసానికి చేరుకున్న తర్వాత గులాబీ అధినేత భావోద్వేగానికి లోనైట్టు తెలిసింది. సిట్ విచారణ కోసం ఆదివారం ఉదయం ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ నందినగర్‌కు వచ్చారు. అనంతరం మధ్యాహ్నం భోజన సమయంలో కేసీఆర్ భావోద్వేగానికి లోనైనట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరిపోసి, ఉద్యమ రచన చేసిన గదిలోనే విచారణ ఎదురుకోవాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదని కేసీఆర్ అన్నట్లు తెలుస్తోంది.
ఇప్పుడు ఏ గదిలో అయితే విచారణ ఎదుర్కొంటున్నానో అదే గదిలో తాను రాష్ట్ర సాధన కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని, ఇదే గదిలో ఎంతో మందితో చర్చలు జరిపానని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వ్యూహ రచన చేసిన గదిలోనే ఇప్పుడు ఇదే గదిలో విచారణ ఎదుర్కోవడం దురదష్టకరం అని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.