calender_icon.png 2 February, 2026 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మళ్లీ అన్యాయమే

02-02-2026 02:00:26 AM

  1. బడ్జెట్ కేటాయింపుల్లో బయో ఫార్మా అంటే గుర్తుకు రావాల్సింది తెలంగాణ 
  2. ఫార్మా హబ్‌గా ప్రపంచంలోనే హైదరాబాద్‌కు గుర్తింపు 
  3. ఆరెంజ్ ఎకానమీలో హైదరాబాద్ సెంట్రిక్‌ను ముంబైకి తరలింపు 
  4. ఎస్సీ, ఎసీ,్ట మైనార్టీల సంక్షేమం గురించి పట్టించుకోలేదు 
  5. కక్ష సాధింపు చర్యలకు మా ప్రభుత్వం పాల్పడదు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి) : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన 53.47 లక్షల కోట్ల బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయింపులు లేకపోవడం అన్యాయమని డిప్యూటీ సీఎం భట్టి  విక్రమార్క అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధి కోసం సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కేబినెట్ మంత్రులు, పార్లమెంటు సభ్యులు బృందాలుగా వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్‌లను పలుమార్లు కలిసి విన్నవించినప్పటికీ బడ్జెట్‌లో కేటాయింపులు లేకపోవడం తీవ్ర నిరాశపరిచిందని పేర్కొన్నారు.

ఆదివారం ప్రజాభవన్‌లో ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. మూసీ పునరుజ్జీవం, రీజినల్ రింగ్ రోడ్, హైదరాబాద్ నగర అభివృద్ధి, మెట్రో రైల్ విస్తరణ, ఇతర మౌలిక సదుపాయాల కోసం బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని ఆశించామన్నారు. బయో ఫార్మా అంటే ముందుగా కేంద్రానికి గుర్తురావాల్సింది తెలంగాణ అని, కేంద్ర బడ్జెట్‌లో బయో ఫార్మా రంగానికి సంబంధించి తెలంగాణకు నిధులుయ కేటాయించకపోవడం తీవ్ర నిరాశపరిచిందన్నారు.

కేంద్ర బడ్జెట్‌లో ఎలక్ట్రానిక్స్‌కు రూ.40 వేల కోట్ల కేటాయింపులు చేశారని, అందులో కూడా తెలంగాణకు ఒక పైసా ఇవ్వకపోవడం అన్యాయమని విమర్శించారు. హైదరాబాదులో ఎలక్ట్రానిక్ ఎకో సిస్టం విస్తారంగా అభివద్ధి చెందిందని, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈసీఐ లాంటి సంస్థలను హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసినట్టు గుర్తు చేశారు. ఎలక్ట్రానిక్స్ అంటే హైదరాబాద్.. హైదరాబాద్ అంటే ఎలక్ట్రానిక్స్ అన్నట్టుగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ఈ విభాగంలో కూడా నిధులు ఇవ్వకపోవడం అన్యాయమని మండిపడ్డారు. 

ఫార్మా హబ్‌లోనూ లేని తెలంగాణ..

ఫార్మా హబ్‌గా ప్రపంచానికి హైదరాబాద్ గుర్తింపు పొందిందని, కోవిడ్ సమయంలో ఈ దేశానికే కాకుండా ప్రపంచాన్ని కూడా భారత్ బయోటెక్ ఔషధాలను అందించిందని గుర్తుచేశారు. సాక్షాత్తు ప్రధానమంత్రి మోదీ కోవిడ్ సమయంలో హైదరాబాద్‌ను సందర్శించారని, అయినప్పటికీ ఫార్మా హబ్‌లో కూడా తెలంగాణను పేర్కొనలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడారంగంపైన ఫోకస్ పెట్టిందని, గ్లోబల్ సమ్మిట్‌లో 2047 విజన్ డాక్యుమెంట్ సందర్భంగా కూడా ప్రపంచ ప్రఖ్యాత క్రీడాకారుడితో క్రీడలు నిర్వహించామని, క్రీడారంగం పైన ప్రత్యేక దష్టి సారించి ముందుకెళ్తున్న క్రమంలో తెలంగాణ కేంద్రానికి ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు.

ఆరెంజ్ ఎకానమిలో హైదరాబాద్ సెంట్రిక్‌ను ముంబైకి తరలించడాన్ని ప్రశ్నించారు. ఆడియో వీడియో గేమింగ్ కామెక్స్ లాంటి వాటికి హైదరాబాద్ నగరం బిగ్గెస్ట్ సెంటర్ అని, ఆరెంజ్ ఎకానమీలో హైదరాబాద్‌పై దృష్టి పెట్టకుండా ముంబైలో పెట్టడం ఏంటని ప్రశ్నించారు. హైదరాబాద్ మెడికల్ హబ్‌గా అభివృద్ధి చెందుతున్నదని, దేశంతో పాటు ఇతర దేశాల నుంచి కూడా హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న మెడికల్ ఫెసిలిటీని ఉపయోగించుకోవడానికి వస్తున్నారని, రీజినల్ మెడికల్ వ్యాల్యూ హబ్‌లు ఇతర రాష్ట్రాలకు ఇచ్చి తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. 

టూరిజంలోనూ అన్యాయమే..

టూరిజం విభాగంలో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని పొందుపరచకపోవడం అన్యాయమని, యునెస్కో గుర్తించిన రామప్ప లాంటి హెరిటేజ్ దేవాలయం, మన్ననూరు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్, వాటర్ ఫాల్స్ ఉన్నాయని తెలిపారు. ఇటీవల జరిగిన మేడారం జాతరకు న్యూజిలాండ్ దేశస్తులు వచ్చి దర్శించుకున్నప్పటికీ తెలంగాణ టూరిజంను ప్యాకేజీలో పేర్కొనలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో కేంద్రం దృష్టి సారించలేదని, ఇప్పటికే సింగరేణి సంస్థ సత్తుపల్లి, రామగుండంలో రేర్ ఎర్త్ మినరల్స్ ప్రాసెస్‌ను నడుపుతున్నదన్నారు. తెలంగాణకు సెమీ కండక్టర్ మంజూరు చేయాలని ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్వయంగా వెళ్లి ప్రధానమంత్రిని కలిసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందన్నారు.

కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం..

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వికసిత్ భారత్ లక్ష్యంగా కాంట్రిబ్యూట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 2047 నాటికి త్రీ మిలియన్ డాలర్ ఎకానమీగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నదని, ఈ లక్ష్యం చేరుకోవడానికి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాదులకు ప్రోత్సాహం అందించి ముందుకెళ్లాల్సిన కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పెట్టుకొని రాజకీయాలకు అతీతంగా తెలంగాణ పార్లమెంటు సభ్యులు ఈ బడ్జెట్ సెషన్‌లో ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌లను కలిసి నిధులు కేటాయించాలని వినతి పత్రాలు ఇవ్వాలని కోరారు.

ఫిజికల్ డెఫిషిట్‌లో రాష్ట్రానికి నాలుగు శాతం ఉండాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినప్పటికీ తెలంగాణకు అనుమతి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం దేశంలో అంతర్భాగం కాదా అని ప్రశ్నించారు. ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక గతులు పెంచడానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించే వీలుగా బడ్జెట్ ఉండాలని ఆశించారు.