28 March, 2026 | 2:57 AM

చమురొదిలింది!

28-03-2026 12:53 AM

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం యావత్ ప్రపంచాన్ని అనిశ్చితిలోకి నెడుతున్నది. ముఖ్యంగా ఇంధన సరఫరా వ్యవస్థలు అస్తవ్యస్తం కావడంతో అనేక దేశాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇంధన ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు భారమై నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ ప్రభావం అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలపై పడింది. ఇదే కోవలో భారత్‌పైనా ప్రభావం ఉంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో తాజాగా భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సుజ్ సుంకాన్ని భారీగా తగ్గించి ఇంధనం సరఫరా చేసే కంపెనీలకు ఊరటనిచ్చే ప్రయత్నం చేసింది. పెట్రోల్‌పై సుంకాన్ని లీటరుకు రూ.13 నుంచి రూ.3 కు తగ్గించడమే కాకుండా, డీజిల్‌పై ఉన్న రూ.10 సుంకాన్ని పూర్తిగా ఎత్తివేసింది.

అయితే, ఈ తగ్గింపు ప్రయోజనాలు సామాన్య వినియోగదారులకు వెంటనే అందే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కొన్ని వారాలుగా అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ, దేశీయ ఆయిల్ కంపెనీలు ఆ భారాన్ని ప్రజలపై వేయకుండా కొంతమేరకు నష్టాలనూ భరించాయి. ఇప్పుడు సుంకం తగ్గించడం వల్ల వచ్చిన లబ్ధిని ఈ కంపెనీలు తమ పాత నష్టాలను పూడ్చుకోవడానికి వాడుకునే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశంలో ఇంధన నిల్వల విషయంలో ప్రభుత్వం భరోసా ఇస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి.

అహ్మదాబాద్, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు ఇప్పటికీ బారులు తీరుతున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతుల వల్ల ఆందోళనలు పెరిగి, అవసరమైన ఇంధనం కంటే ఎక్కువగా నిల్వ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో ఇంధన కొరత ఏర్పడుతున్నది. కేంద్ర ప్రభుత్వం ఒకవైపు, ప్రస్తుతం దేశంలో 60 రోజులకు సరిపడా ముడిచమురు నిల్వలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నది.

హొర్ముజ్ జలసంధిలో అంతరాయాలు ఉన్నప్పటికీ, ఇతర దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకునేలా ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేశారు. కానీ, ఎల్పీజీ సరఫరా విషయంలో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో ఆటోడ్రైవర్ల పరిస్థితి దయనీయంగా మారింది. ఎల్పీజీ నింపుకునేందుకు వారు రాత్రంతా బంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు.

రాత్రంతా నిరీక్షణకే సమయం సరిపోతే ఇక ఆటో ఎప్పుడు నడపాలి, కుటుంబ పోషణకు డబ్బులు ఎప్పుడు సంపాదించాలంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలి. హోర్డింగ్, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలి.  పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) కనెక్షన్లను మరింత వేగంగా విస్తరించడం ద్వారా ఎల్పీజీపై ఒత్తిడిని తగ్గించవచ్చు. అంతర్జాతీయంగా చమురు సరఫరాలో అంతరాయం కలగకుండా దౌత్యపరమైన చర్చలు జరపాలి.

అప్పుడే ఇలాంటి అంతర్జాతీయ సంక్షోభాల నుంచి సామాన్య ప్రజలను రక్షించడం సాధ్యమవుతుంది. ప్రభుత్వం ఇంధన సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తూ నిల్వలు పెంచుకోవాలి. అప్పుడే ధరల స్థిరీకరణ సాధ్యం అవుతుంది. ప్రజలు కూడా వదంతులను నమ్మి కంగారుగా ఇంధనాన్ని నిల్వ చేయకూడదు. ప్రభుత్వం, ప్రజలు కలిసికట్టుగా కృషి చేస్తేనే ఈ ఇంధన సంక్షోభం నుంచి గట్టెక్కడం సాధ్యమవుతుంది.