27 March, 2026 | 1:43 AM

అగ్రరాజ్య దూకుడుకు కళ్లెం!

27-03-2026 12:00 AM

అగ్రరాజ్యం అమెరికా తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి ప్రారం భించిన యుద్ధం ఇప్పుడు ఆ దేశానికే పెను సవాల్‌గా మారింది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవాలనే సాకుతో అమెరికా, ఇజ్రాయెల్ కూటమిగా ఏర్పడి జరిపిన దాడులు పశ్చిమ ఆసియాను అగ్నిగుండం గా మార్చాయి. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తోందన్న అనుమానం, దీనివల్ల తమమనుగడకే ప్రమాదమని భావించిన ఇజ్రాయెల్ భయమే యుద్ధానికి నాంది పలికింది.

మరోవైపు, ఒక్క ఇరాన్‌లో తప్ప అన్ని అరబ్ దేశాల్లో తన సైనిక స్థావరాలు ఏర్పా టు చేసుకున్న అమెరికా, ఇజ్రాయెల్‌తో కలి సి ఇరాన్ అణు, సైనిక స్థావరాలను ధ్వంసం చేయాలని ప్లాన్ చేసింది. ఏకఛత్రాధిపత్యం గా ఇరాన్ సుప్రీం కమాండర్ ఆయతుల్లా ఖమేనీని హతమార్చి, అక్కడ ప్రజాపాలన పేరుతో తమకు అనుకూలమైన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అమెరికా ఆశించింది.

తద్వారా ఆయిల్, ఇంధనం, హోర్మోజ్ జలసంధిని స్వాధీనం చేసుకుని తిరుగులేని శక్తిగా ఉండాలని చూస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి గత ఫిబ్రవరి 28వ తేదీన ఖమేనీ రహస్య నివాసంపై అత్యంత శక్తిమంతమైన క్షిపణులతో దాడి జరిపాయి. దాడిలో 1989 నుంచి ఇరాన్ అత్యున్నత నేతగా పాలన సాగిస్తున్న ఖమేనీ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు మరణించడంతో యుద్ధం తీవ్రరూపం దాల్చిం ది. అగ్రరాజ్య అహంకారంతో తానేది చేసి నా అడుగులకు మడుగులొత్తే దేశాల మద్ద తు లభిస్తుందని భావించిన ఆ దేశాధ్యక్షుడు ట్రంప్‌కు ఇప్పుడు ఎదురుదెబ్బ తగిలింది. 

అంచనాలు తలకిందులు

ఖమేనీని మట్టుపెట్టి అధికార మార్పిడి చేసి, ప్రపంచంలోని 20 శాతం ఆయిల్ గ్యాస్ రవాణాకు మార్గమైన హోర్మోజ్ జలసంధిని తన గుప్పిట్లో పెట్టుకోవాలనుకున్న ట్రంప్ ఆశలు అడియాశలయ్యాయి. యుద్ధం ప్రారంభమై 25 రోజులు గడుస్తున్నా వెన్నుచూపని ఇరాన్‌లో ఏ విధమై న ప్రభుత్వ మార్పిడి జరగకపోగా, యావ త్ ఇరాన్ సైన్యం ఏకమై పోరాటానికి మద్దతు ఇవ్వడం ట్రంప్‌ను విస్మయానికి గురిచేసింది. ఇంతలా పోరాట పటిమ ఉంటుందని ఊహించని ట్రంప్ ఇప్పుడు ఏమి చేయాలో పాలుపోక మరిన్ని దాడులకు దిగుతున్నారు.

ఇలాంటి యుద్ధాలను నివారించాల్సిన ఐక్యరాజ్యసమితి (ఐరాస) కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమైంది. ఇది అమెరికా చేతిలో ఉన్న కీలుబొమ్మ సమితి అని మరోసారి ప్రపంచానికి అర్థమైంది. ఇరాన్ తన అధునాతన సైబర్ విభాగం ద్వారా ఇతర దేశాల్లోని విద్యుత్ గ్రిడ్లు, బ్యాంకింగ్ వ్యవస్థలు, నీటి సరఫరా కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది.

ప్రతిగా అమెరికా కూడా ఇరాన్ సైనిక కమ్యూనికేషన్ వ్యవస్థను స్తంభింపజేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నది. యు ద్ధం వల్ల కేవలం సైనిక వ్యవస్థలే కాకుం డా, సామానుల దైనందిన జీవితంఛిన్నాభిన్నం అవుతోంది. విద్యా సంస్థలు, ఆసు పత్రుల సేవలు ఆగిపోవడం, రవాణా వ్యవస్థలు స్తంభించడం వంటివి ఏ దేశం లో ఉన్న పౌరులకైనా తీవ్రమైన ఇబ్బందులే. ఇలాంటి పరిస్థితులు మున్ముందు అంతర్జాతీయ సవాల్‌గా మారుతుందని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇరాన్ బలమైన శక్తి

ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ఆయుధ సంపత్తి ప్రస్తు తం పశ్చిమాసియాలోనే అత్యంత శక్తిమంతమైందని విశ్లేషకులు చెప్తున్నారు. ఆ దేశం వద్ద ఉన్న క్షిపణి వ్యవస్థ ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేస్తున్నది. సుమారు వేలాది కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ‘ఖైబర్ షెకా న్’, ‘షాహాబ్-3’ వంటి బాలిస్టిక్ క్షిపణులు ఇరాన్‌కు ప్రధాన బలం. ఇవే కాకుండా, రాడా ర్లకు చిక్కకుండా ప్రయాణించే ‘షాహెద్’ సిరీస్ ఆత్మాహుతి డ్రోన్లు యుద్ధ గమనాన్నే మార్చేసింది.

సముద్ర మార్గం లో అమెరికా నౌకాదళాన్ని అడ్డుకోవడానికి ఇరాన్ ఉపయోగిస్తున్న యాంటీ-షిప్ క్షిపణులు, వేగం గా ప్రయాణించే చిన్న యుద్ధ నౌకలు హోర్మోజ్ జలసంధిపై ఇరాన్ పట్టును మరింత బిగిస్తున్నాయి. రష్యా, చైనా వంటి దేశాల సాంకేతిక సహకారంతో రూపొందించిన భూగర్భ క్షిపణి ఎంతటి భారీ వైమానిక దాడులనైనా తట్టుకుని ఎదురుదాడి చేయగల సామర్థ్యాన్ని వీరికి కల్పిస్తున్నాయి.

ప్రపంచ దేశాలకు ఇంధన సెగలు

అమెరికా, ఇజ్రాయెల్ పోకడలతో చిర్రెత్తిన ఇరాన్ తన అధీనంలోని హోర్మోజ్ జలసంధిని మూసేసింది. దీని ద్వారా ఏ నౌక వెళ్లాలని ప్రయత్నించినా పేల్చేస్తామని హెచ్చరించింది. దీంతో వందలాది నౌకలు సముద్ర జలాల్లో చిక్కుకుపోయి ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ కొరత ఏర్పడింది.

ఈ క్లిష్ట సమయంలో భారత్ తన దౌత్య నీతిని చాటుకుంది. భారత జాతీయ జెండా ఉన్న నౌకలకు మాత్రం ఇరాన్ అనుమతి ఇవ్వడంతో ప్రపంచం నివ్వెరపోయింది. ఫలితంగా సోమవారం రెండు నౌకలు గుజరాత్ తీరానికి ఆయిల్, గ్యాస్ తో చేరుకున్నాయి. ఆత్మరక్షణలో పడిన ట్రంప్ ఈ కష్టం నుంచి గట్టెక్కేందుకు నాటో దేశాల సహకారం కోరినా జపాన్, ఫ్రాన్స్, కెనడా, ఇంగ్లాండ్ వంటి దేశాలు మొహం చాటేశాయి. దీంతో అమెరికా పరిస్థితి అడుసు తొక్కి .. కాళ్లు కడుక్కోలేని విధంగా మారింది.

భౌగోళిక రాజకీయాల చదరంగం

నిజానికి 1968లో ఏర్పడిన అణు నిరాయుధీకరణ ఒప్పందంపై ఇరాన్ 1970లో సంతకం చేసింది. అయితే, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య తరచూ ఈ ఒప్పం దం నుంచి వైదొలుగుతామని ఇరాన్ ఇతర సభ్య దేశాలను బెదిరిస్తూ వస్తోంది. తన అణు పరీక్షలకు సంబంధించిన కార్యకలాపాల వివరాలను ప్రకటించడంలో ఇరాన్ నిర్లక్ష్యం వహిస్తున్నట్లు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అనేక సందర్భాల్లో నివేదించింది. ఇది సభ్య దేశాల్లో అనుమానాలను రేకెత్తిస్తోంది.

అయితే ఇరాన్ మా త్రం తన అణు కార్యకలాపాలు పూర్తిగా పౌర ప్రయోజనాల కోసమే అని వాదిస్తోంది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ నమ్మకపోవడం, దానికి అమెరికా తోడవ్వడం వల్ల యుద్ధం అనివార్య మైంది. ఇంతటి అత్యాధునిక ఆయుధ సంప త్తి ఇరాన్ వద్ద ఉందని ఊహించని అమెరికా, ఇజ్రాయెల్ ఇప్పుడు ఆ దేశ సామర్థ్యా న్ని చూసి ఆశ్చర్యపోతున్నాయి. ఈ ఆయుధాలను చైనా, రష్యా సరఫరా చేస్తున్నాయని అనుమానించడం ఆ రెండు దేశాల వంతైంది.

నిలిచిపోయిన రవాణా

హోర్మోజ్ జలసంధి అనేది పర్షియన్ గల్ఫ్ ను, ఒమాన్ గల్ఫ్ ను కలిపే కీలకమైన సముద్ర మార్గం. దీని వెడల్పు కేవలం 39 కిలోమీటర్లు ఉన్నప్పటికీ దీని అవసరం ప్రపంచానికి అపారం. ప్రపంచంలోని 20 శాతం చమురు, 20 శాతం సహజ వాయువు, 30 శాతం ఎరువుల రవాణా ఈ మార్గం నుంచే జరుగుతుంది. సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్ వంటి దేశాల నుంచి చైనా, భారత్, జపాన్ దేశాలకు వెళ్లే ఇంధనం ఇక్కడి నుంచే వెళ్లాలి. ఈ చమురు రవాణాలోనే భాగంగా నత్రజనికి అవసరమైన అమోనియా, యూరియా గల్ఫ్ దేశాల నుంచే రవాణా జరుగుతాయి.

ప్రపంచంలోని పంటల్లో సగానికి పైగా ఈ ఎరువులపైనే ఆధారపడి ఉన్నాయి. జలసంధి మూసివేయడంతో రవాణా స్తంభించి యూరియా ధరలతో పాటు గోధుమలు, మొక్కజొన్న, పామాయిల్ ధరలు పెరిగి ప్రపంచం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లింది. ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ ఒంటరయ్యాయి. ఏమాత్రం వెనక్కి తగ్గని ఇరాన్ తో చర్చలు జరపాలంటే అది ఒక్క భారత్ వల్లే సాధ్యమని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. తొలి నుంచి తటస్థ వైఖరి అవలంబిస్తున్న భారత్ చొరవ తీసుకుని చర్చలు జరిపితే ఈ యుద్ధానికి తెరపడి, హోర్మోజ్ జలసంధి తెరుచుకుంటుంది.

అప్పుడే ప్రపంచం ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతుంది. ఈ సమస్య పరిష్కారం ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల్లోనే ఉందని యావత్ ప్రపంచం మన వైపు చూస్తోంది. మానవాళి ఇతర గ్రహాలకు వెళ్లే సాంకేతికతను సంపాదించినా, చర్చల ద్వారా పరిష్కరించుకునే సమస్యను యుద్ధ దురహంకారంతో కూల్చుకోవడం విషాదకరం. ప్రాణనష్టం, ఆస్తి నష్టాన్ని నివారించడం ఇప్పుడు భారత నాయకత్వంపైనే ఆధారపడి ఉంది.

 వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్, 

సెల్: 94915 45699

చలాది పూర్ణచంద్రరావు