8 May, 2026 | 9:27 PM

లక్ష ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు

11-12-2024 12:04 AM
  1. మార్చి నాటికి లక్ష్యాన్ని పూర్తి చేయాలి
  2. యాసంగి నుంచి యాంత్రీకరణ పథకం అమలు 
  3. పీఏసీఎస్‌ల బలోపేతానికి కృషి చేయాలి 
  4. వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖ సమీక్షలో మంత్రి తుమ్మల

హైదరాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): రాష్ట్రంలో మార్చి నాటికి లక్ష ఎకరాల్లో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ పూర్తి చేయాలని అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించా రు.

యాంత్రీకరణ పథకం కింద యాసంగి నుంచి సాధ్యమైనంత త్వరగా రైతులకు నాణ్యమైన పనిముట్లు, యంత్రాలను సబ్సిడీపై సరఫరా చేయాలని సూచించారు. సచి వాయలంలో వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్, కో-ఆపరేటివ్ రాష్ర్టస్థాయి అధికా రులతో మంగళవారం నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వ పథకాల కింద విడుదలయ్యే నిధులను పూర్తి గా వినియోగించుకునేందుకు రాష్ర్ట ప్రభు త్వం మ్యాచింగ్ గ్రాంట్ నిధులను విడుదల చేయనున్నట్లు చెప్పారు. ప్రతిపైసా రైతు సంక్షేమానికి ఉపయోగపడేలా చూడాలని కోరారు. ఇంకా రెండు నెలల పాటు పత్తి కొనుగోలు సజావుగా జరిగేలా చూడాలన్నారు.

ప్రాథమిక సహకార సంఘాల సేవ లు ఎక్కువ మంది రైతులకు చేరేలా ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పిం చాలని సూచించారు. అదేవిధంగా ఉద్యానశాఖ అధికారులతో సమావేశమై ఉద్యాన పంటలకు సబ్సిడీపై డ్రిప్ పరికరాలు, స్ప్రింక్లర్లు అందించాలని ఆదేశించారు. ఇందుకోసం 90 రోజులపాటు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, రోజు రూ.కోటి విలువైన డ్రిప్ పరికరాలు అందించాలన్నారు.

గత ప్రభుత్వం ఆయిల్ పామ్ పంటలకే డ్రిప్ పరికరాలు ఇవ్వగా తమ ప్రభుత్వం అన్ని ఉద్యానపంటలకు డ్రిప్, స్ప్రింక్లర్లను సబ్సిడీపై అందిస్తున్నదని తెలిపారు. రాష్ర్టంలో ఇప్పటివరకు 2.31 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరిగిందని, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 28 వేల ఎకరాల్లో పూర్తి చేసినట్టు వివరించారు. ప్లాంటేషన్ పురోగతిపై ప్రతిరోజు ఆయిల్ పామ్ కంపెనీలతో సమీక్ష నిర్వహించి మార్చికల్లా జిల్లాల వారీగా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించాలన్నారు.  

అనంతరం మార్కెటింగ్ అధికారులు మాట్లాడుతూ ఇప్పటిదాకా 8,59,272.68 టన్నుల పత్తిని  మద్ధతు ధరతో సేకరించామని తెలిపారు. గతేడాది ఇదే సమయానికి 1,99,108.43 టన్నుల పత్తిని సేకరించగా.. దానితో పోలిస్తే ఈ ఏడాది 400 శాతం ఎక్కువ కొనుగోలు చేసినట్టు అధికారులు చెప్పడంతో వారికి మంత్రి అభినందనలు తెలిపారు. సమావేశంలో వ్యవసాయశాఖ సెక్రెటరీ రఘునందన్‌రావు, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ ఉదయ్‌కుమార్, హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా పాల్గొన్నారు.