19-11-2025 02:28:09 PM
చట్ట ప్రకారం వయో వృద్ధులకు సత్వర న్యాయం చేయడం జరుగుతుంది
వయో వృద్ధుల గుర్తింపు కార్డుకు జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి
వనపర్తి జిల్లాలో త్వరలోనే ఓల్డ్ ఏజ్ హోం ఏర్పాటు
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి,(విజయక్రాంతి):జిల్లాలో ఎక్కడైనా వృద్ధ తల్లిదండ్రులను తమ పిల్లలు సరైన ఆలనా పాలన నిర్వహించని పక్షంలో వెంటనే ఆర్డీవోకు ఫిర్యాదు చేయాలని, టోల్ ఫ్రీ నెంబర్ 14567కు ఫిర్యాదు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. ప్రపంచ వయవృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని బుధవారం ఐడిఓసి సమావేశ మందిరంలో వారోత్సవ ముగింపు వేడుకలు నిర్వహించారు. జిల్లాలో ఎక్కడైనా వృద్ధ తల్లిదండ్రులను తమ పిల్లలు సరైన ఆలనా పాలన నిర్వహించని పక్షంలో వెంటనే ఆర్డీవోకు ఫిర్యాదు చేయాలని లేదా టోల్ ఫ్రీ నెంబర్ 14567కు ఫిర్యాదు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు.
ప్రపంచ వయవృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని బుధవారం ఐడిఓసి సమావేశ మందిరంలో వారోత్సవ ముగింపు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నవంబర్ 12వ తేదీ నుండి వారం రోజులపాటు వనపర్తి జిల్లాలో వయోవృద్ధుల కొరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా వయో వృద్ధులకు వారి హక్కుల పై అవగాహన కార్యక్రమాలు, ఆటల పోటీలు, చెస్, వాకథాం వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. వయవృద్ధుల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత అని గుర్తిస్తూ రాజ్యాంగంలో ఒక ఆర్టికల్లో పేర్కొనడం జరిగిందన్నారు.
ఇందులో భాగంగా ప్రభుత్వము సీనియర్ సిటిజన్ యాక్ట్ తీసుకురావడం జరిగిందని, ఎవరైనా తమ తల్లిదండ్రులను పట్టించుకుంటే ఆర్డీఓ కు ఫిర్యాదు చేస్తే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఒకవేళ ఆర్డీఓ ఇచ్చిన తీర్పు నచ్చకుంటే కలెక్టర్ కు అప్పీల్ చేసుకోవచ్చని తెలిపారు. వనపర్తి జిల్లాలో ఆర్డీఓ ద్వారా 53 ఫిర్యాదులను పరిష్కరించి వృద్ధ తల్లిదండ్రులకు తమ పిల్లల నుండి ప్రతినెల పరిహారం ఇచ్చే విధంగా తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు. ఆర్డీఓ ఇచ్చిన తీర్పు నచ్చలేదని 5000 నెలకు చాలా ఎక్కువ మేము 1000 మాత్రమే ఇస్తాము అని కొంతమంది కుమారులు కలెక్టర్ కు అప్పీల్ చేసుకున్నట్లు తెలిపారు.
అయితే ఆర్డీఓ 5000 ఇవ్వమని తీర్పు ఇస్తే తాను నెలకు 10000 ఇవ్వాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. జిల్లాలో దాదాపు 23 వేల మందికి ప్రభుత్వం ద్వారా వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని, ఈ నెలలోనే 95 మందికి కొత్తగా పెన్షన్ మంజూరు చేసినట్లు తెలిపారు. వయో వృద్ధుల పెన్షన్ భార్యకు లేదా భర్తకు ఒకరికే ఇస్తారని ఒకవేళ పెన్షన్ పొందుతున్న దంపతుల్లో భార్య కానీ భర్త కానీ చనిపోతే వెంటనే దరఖాస్తు చేసుకొంటే మిగిలిన వారికి పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుందన్నారు.
మధుమేహం ఉన్న వారికి రేటినోపతి వ్యాధి వల్ల దృష్టి కోల్పోయే ప్రమాదం ఉంటుందని అందువల్ల జిల్లాలోని మధుమేహం వ్యాధిగ్రస్తులకు ఉచితంగా దృష్టి కార్యక్రమం ద్వారా రేటినోపతి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. త్వరలో వయో వృద్ధులకు ఐ.డి. ఒ సి లో ప్రత్యేక క్యాంపు నిర్వహించి రేటినోపతి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. త్వరలోనే జిల్లా వయో వృద్ధులకు పౌష్టికాహారం, ఆరోగ్య సలహాలు ఇచ్చేందుకు ఓల్డ్ ఏజ్ హోం ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. వయో వృద్ధులు ప్రతిరోజూ కనీస వ్యాయామాలు చేసి తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని సూచించారు.
60 సంవత్సరాల వయస్సు దాటిన వారు వయో వృద్ధుల గుర్తింపు కార్డు పొందేందుకు జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకొని గుర్తింపు కార్డు పొందాలని సూచించారు. అనంతరం సీనియర్ సిటిజన్ కమిటీ సభ్యులను శాలువా, మెమెంటో లతో సన్మానం చేశారు. ఆటల పోటీల్లో విజేతలు అయిన వయో వృద్ధులకు ట్రోఫీలను అందజేసి సన్మానం చేశారు. అదనకు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య, డీఎస్పీ బాలాజీ, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మమ్మ, సీనియర్ సిటిజన్ కమిటి సభ్యులు శంకర్ గౌడ్, నర్సింహులు గౌడ్, హమీద్, శంశోద్దిన్, స్వచ్ఛంద సంస్థ నుండి చిన్నమ్మ థామస్, ఖమర్ రెహమాన్ సైతం వయో వృద్ధుల సమస్యల పై మాట్లాడారు. వయో వృద్ధులు పాల్గొన్నారు.