19-11-2025 02:03:28 PM
పుట్టపర్తి: సత్యసాయి బాబా(Sathya Sai Baba) ఎల్లప్పుడూ ఇతరులను అర్థం చేసుకోవాలని బోధించారని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) అన్నారు. సమాజంలోని అనేక సమస్యలను పరిష్కరించగల తత్వశాస్త్రం ఇది అన్నారు. పుట్టపర్తిలో జరిగిన శ్రీ సత్యసాయి బాబా జన్మ శతాబ్ది ఉత్సవాల్లో సచిన్ ప్రసంగించారు. బాబా తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేశారని టెండూల్కర్(Tendulkar) తెలిపారు. సత్యసాయి బాబా బోధనలు తనలో ఎంతో ప్రేరణను ఇచ్చాయని పేర్కొన్నారు.
ఐదేళ్ల వయస్సులో ఉన్నప్పుడు తన వెంట్రుకలు సత్యసాయిలా ఉన్నాయనే వారని గుర్తుచేసుకున్నారు. తన మదిలో ఎన్నో ప్రశ్నలకు బాబా దగ్గర సమాధానాలు దొరికాయని వివరించారు. సత్యసాయి బోధనలు తనను మార్గదర్శనం చేశాయని పేర్కొన్నారు. బాబా ఆశీస్సులతో జీవితంలో ఎన్నో సాధించానని సచిన్ టెండూల్కర్ స్పష్టం చేశారు. 2011 క్రికెట్ ప్రపంచ కప్ భావోద్వేగ క్షణాల్లో, జట్టు బెంగళూరులో ఉన్నప్పుడు బాబా స్వయంగా తనకు ఫోన్ చేశారని, తరువాత తనకు ఒక పుస్తకం పంపారని టెండూల్కర్ జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్నారు. "ఆ పుస్తకం నాకు సానుకూలత, ప్రేరణనిచ్చింది. మేము ఆ సంవత్సరం ట్రోఫీని గెలుచుకున్నాము. ఇది నా జీవితంలో ఒక స్వర్ణ క్షణంగా మిగిలిపోయింది" అని టెండూల్కర్ తెలిపారు.