9 May, 2026 | 2:33 AM

పండుటాకులను పట్టించుకుందాం

17-05-2024 12:05 AM

భారతదేశ జనాభా 140 కోట్లు. 2022 అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 14 కోట్ల మంది 60 సంవత్సరాల పైబడిన వృద్ధులు.  మన దేశంలో పూర్వం లాగా ఉమ్మడి కుటుంబాలు లేనందున చాలామంది వయో వృద్ధులు నిరాదరణకు గురై దుర్భర జీవితం గడుపుతున్నారనేది వాస్తవం. పెంచి పోషించిన సంతానం విదేశాల్లో స్థిర పడటం మూలాన, వృద్ధాప్యంలో ప్రేమకు దూరమై శేష జీవితాన్ని భారంగా గడిపేవారు కొందరైతే, కడుపున పుట్టిన సంతానం నిరాదరణకు గురై, తమకు తాము పోషించుకోలేక జీవచ్ఛవాల మాదిరి వృద్ధాశ్రమాల్లో జీవితం గడిపే వారు కొందరు. ముసలి తల్లిదండ్రులు మరణిస్తే వారి అంత్యక్రియలను కూడా పట్టించుకోని వారసులు న్నారంటే అతిశయోక్తి కాదు.  విదేశాల్లో ఉండే కొంతమంది సంతానం సెలవు దొరకలేదనే సాకుతో ఆన్‌లైన్‌లోనే తల్లితండ్రుల అంత్యక్రియలు జరుపుతు న్నారు. వారి స్వార్జిత స్థిరచరాస్తులను కూడా మోసపూరితంగా తామే అనుభవించే పుత్రరత్నాలు లేకపోలేదు. అదే ప్రయత్నంలో తల్లిదండ్రులను ఇంటినుండి గెంటి వేసిన  సంఘటనలూ వింటున్నాం. వీటన్నిటికీ కారణం స్వార్థ ప్రయోజనాలు, డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వటం. అనుబంధాలు, ఆప్యాయతలు అనే పదాలకు ఉమ్మడి కుటుంబాలతోపాటే కాలం చెల్లిందేమో! అమ్మమ్మలు, నాయినమ్మలు, తాతయ్యలు చెల్లని నాణేలుగా మారుతుండటం దురదృష్టకరం. 

ప్రత్యేక ట్రిబ్యునల్

వృద్ధాప్యంలో తల్లిదండ్రులు గౌరవప్రదమైన జీవనం గడపాలనే సదు ద్దేశ్యంతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టాన్ని ఏర్పరిచాయి. ఈ చట్టం ప్రకారం ప్రతి రెవెన్యూ డివిజనల్ అధికారి ట్రిబ్యునల్‌గా వ్యవహరిస్తారు. సివిల్ కోర్టుకు ఉండే అన్ని అధికారాలను ఈ ట్రిబ్యునల్‌కు కట్టబెట్టింది చట్టం. వృద్ధుల పోషణ, వారి సంక్షేమం నిమిత్తం వారి సంతానానికి తగిన ఉత్తర్వులు జారీ చేయవచ్చు. కారణం లేకుండా ఉత్తర్వులను పాటించకపోతే ప్రతివాదిని జైలుకు పంపించటం లేదా స్థిరచరాస్థులను స్వాధీన పరచుకోవటం లేదా ప్రభుత్వ ఉద్యోగి అయినట్లయితే వేతనం నుండి వారంటు ద్వారా భరణం రాబట్టుకునే అధికారం ఉంది. మోసపూరితంగా తల్లిదండ్రుల ఆస్తి చేజిక్కించుకొని వారిని నిర్లక్ష్యం చేస్తే, ఆస్తి పత్రాలను రద్దు చేసే ఉత్తర్వులనుకూడా ఈ చట్టం కల్పించింది. రెవెన్యూ డివిజనల్ అధికారి జారీ చేసే ఉత్తర్వులమీద జిల్లా కలెక్టర్ ముందు అప్పీలు చేసుకునే అవకాశం ఉంది. న్యాయవాదిని నియమించుకునే అవకా శం ఈ చట్టం  కల్పించలేదు. ఫిర్యాదుదారు తన కేసు వివరాలు స్వయంగా లేదా సాంఘిక సంక్షేమశాఖ అధికారి ద్వారా ఈ ట్రిబ్యునల్ ముందు వివరించవచ్చు. ఫిర్యాదుదారు స్వయంగా హాజరు కాలేని పరిస్థితుల్లో అతని ప్రతినిధి లేదా ఏదేని సంస్థ ట్రిబ్యునల్ అనుమతితో ఫిర్యాదు సమర్పించే అవకాశాన్ని ఈ చట్టం కల్పించింది. 

గౌరవ ప్రదమైన జీవితాన్నిద్దాం

ఈ చట్టం అనుబంధాలను దగ్గర చేయలేకపోవచ్చు, కానీ, వయోవృద్ధులకు పోషణకు తగిన గౌరవప్రదమైన జీవితాన్ని అందిస్తుంది. వారి కోసం ప్రభుత్వాలు తెచ్చిన పథకాలు, వాటిద్వారా సంక్రమించే ఉపయోగాల ను విస్తృతంగా ప్రచారం చేయాలి. వయోవృద్ధులకు అందించే ఆరోగ్యబీమాపై చెల్లించాల్సిన ప్రీమియం, వయస్సుతో నిమిత్తం లేకుండా వారి ఆదాయం/ ఆర్జన ప్రకారం ఉంటే, ఆర్థిక భారం తగ్గుతుంది. నిరాదరణకు గురైన వయో వృద్ధుల అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స ఉండాలి. బస్టాండ్‌ల్లో, రైల్వే స్టేషన్లలో, విమానాశ్రయాల్లో, పింఛను కార్యాలయాల్లో, బ్యాంకుల్లో వీరి కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలి. అవసరమై న మేరకు చక్రాల కుర్చీలు అందుబాటులో ఉంచాలి. వయోవృద్ధుల కాల పరిమితి డిపాజిట్లమీద వచ్చే వడ్డీని ఆదాయపు పన్నునుండి మినహాయించాలి. 

(వ్యాసకర్త : విశ్రాంత జిల్లా జడ్జి)

సెల్: 9848545970