10 June, 2026 | 7:52 PM

అమ్మో జూన్!

16-06-2024 01:28 AM
  • బెంబేలెత్తుతున్న సాధారణ ప్రజానీకం

ఖర్చుల మాసంగా జూన్‌పై భయం

వ్యవ‘సాయానికి’ రైతుల ఆరాటం

పెట్టు‘బడి’ ఖర్చులతో కర్షకులకు అధికభారం

పిల్లల ఫీజులపై సామాన్యుల్లో అయోమయం

ఆర్థిక వనరుల వేటలో తల్లిదండ్రులు తలమునకలు

జగిత్యాల, జూన్ 15 (విజయ క్రాంతి): జూన్ మాసమంటే మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వ్యవ‘సాయం’ కోసం రైతులు ఎదురుచూస్తుంటారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కొనుగోళ్లకు ఆరాటపడుతుంటారు. మరోపక్క పిల్లల స్కూల్ ఫీజులు, పుస్తకాలు.. ఇతర ఖర్చులు అన్నీ కలిసి సామాన్యుడిపై ఆర్థికభారం మోపుతున్నాయి. జగిత్యాల జిల్లాలో అయితే.. ప్రైవేటు విద్య మరింత భారంగా మారింది. ఫీజులు చుక్కలనంటాయి. పుస్తకాలు, యూనిఫాంలు ఇతరత్రా వస్తువుల ధరల సరేసరి. వీరిలో రైతు కుటుంబాల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఒకపక్క సాగుబడి, మరోపక్క పిల్లల చదువులకు పెట్టుబడి వెరసీ కర్షకులకు ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్పుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది.

తర‘గది’కో రేటు!

జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి పట్టణాలతోపాటు మండలాల్లో సుమారు 500లకు పైగా ప్రైవేట్ విద్యాలయాల్లో ఆయా విద్యాసంస్థలు ప్రమాణాలను బట్టి 25 వేల నుంచి లక్షకుపైగా ఫీజులున్నాయి. ఐఐటీ, ట్యూషన్,  కల్చరల్ యాక్టివిటీస్, కరాటే, యోగా, ప్రత్యేక తరగతులు.. అధనపు ఖర్చులు. ప్రైవేటు స్కూళ్లపై  ప్రజలు చూపిస్తున్న ఆసక్తిని ఆర్థికంగా లాభాలు గడించే మార్గాలుగా ఆయా విద్యాసంస్థలు మలుచుకుంటున్నాయి. ఇంటర్నేషనల్, వరల్డ్, ఈటెక్నో, ప్లేస్కూల్, డిజిటల్ ట్యాలెంట్ ఇలాంటి వినూత్న పేర్లతో విద్యాసంస్థలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. విద్యాసంస్థల్లో చేరితేనే ఏదో తెలియని విజ్ఞానం వస్తుందంటూ మభ్యపెడుతున్నాయి. ప్రచారాలకు ఆకరితులై పిల్లలను ఆ స్కూళ్లల్లో చేర్పించాక ఫీజుల భారం భరించలేక ఎంతోకొంత తగ్గించాలని బేరాలకు దిగడం తల్లిదండ్రుల వంతుగా మారుతోంది. 

బడ్జెట్‌తో కుస్తీ..

జూన్ మాసం వచ్చిందంటే చాలు తల్లిదండ్రులకు బడ్జెట్‌తో కుస్తీ తప్పడం లేదు. పిల్లల చదువుల ఖర్చు కోసం ఆర్థిక వనరులు సమకూర్చడంలో తలమునకలవుతు న్నారు. రైతులతో అటు పెట్టుబడి, సాగుబడికి డబుల్ భారంతో అప్పులపాలు కావాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. పిల్లల ఫీజుల భారం, ఖరీఫ్ సీజన్లో విత్తనాలు, ఎరువుల కోసం కరకులు పడే కష్టాల మాసంగా మారి పోయిందని పేద, మధ్య తరగతి కుటుంబాలు జూన్ మాసం తలుచుకుంటూ తల్లడిల్లిపోతున్నారు.