క్లిక్ చేస్తే బతుకు ఆగం!
- యువతే లక్ష్యంగా హనీట్రాప్
అందమైన అమ్మాయిలు.. ఆకర్షణీయమైన యాడ్స్
ఏఐతో సృష్టించిన నకిలీ భామలతో రాత్రి వేళల్లో గాలం
అప్రమత్తంగా ఉండాలంటున్న సైబర్ పోలీసులు
హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 17 (విజయక్రాంతి): ఒంటరిగా ఉన్నారా.. ఇంకెం దుకు ఆలస్యం.. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అందమైన అమ్మాయిలు, ఆంటీలతో సరదాగా మాట్లాడుకోండి.. మీ రంగు, రూపంతో మాకు పనిలేదు.. సోషల్ మీడియాలో విహరిస్తున్నప్పుడు మీకు ఇలాంటి ప్రకటనలు కనిపిస్తున్నాయా అయితే జాగ్రత్త ఆ తీయటి మాటలు మీ ఒంటరితనాన్ని పోగొట్టడానికి కాదు మిమ్మల్ని నిలువునా దోచుకోవడానికి సైబర్ కేటుగాళ్లు విసిరిన వల. యువతను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఈ ఘరానా సెక్స్టార్షన్ దందాను సైబర్ క్రైమ్ పోలీసులు బట్టబయలు చేశా రు.
ఈ ప్రకటనల్లో కనిపిస్తున్న అమ్మాయి లు, వారు మాట్లాడే మాటలు ఏవీ నిజం కావని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి నేరగాళ్లు సృష్టించిన నకిలీ వీడియో లని తేల్చారు. ఆ ఫేక్ డేటింగ్ యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయగానే, అందులో దాగి ఉన్న మాల్వేర్ ఫోన్ కంట్రోల్‌ను కేటుగాళ్ల చేతికి ఇచ్చేస్తుంది. కాంటాక్ట్ లిస్ట్, గ్యాలరీలోని వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు వారి సర్వర్లోకి వెళ్లిపోతాయి. దీంతో వ్యక్తిగత సమాచారంపై నేరగాళ్లకు పూర్తి పట్టు లభిస్తుందని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
న్యూడ్ వీడియో కాల్..ఆపై బ్లాక్‌మెయిల్
నేరగాళ్ల అసలు దందా రాత్రి పూట మొదలవుతుంది. వారు పంపిన యాప్ ద్వారా వీడియో కాల్ చేస్తే అటువైపు ఒక అమ్మాయి నగ్నంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇది ముందే రికార్డ్ చేసిన వీడియో. ఆ సమయంలో అవతలి వ్యక్తులు మీ ముఖాన్ని, మీరు చేస్తున్న చేష్టలను స్క్రీన్ రికార్డింగ్ చేస్తారు. మరుక్షణమే అసలు వేధింపులు మొదలవుతాయి. మీ నగ్న వీడియో మా దగ్గర ఉంది.. దీన్ని మీ బంధువులకు, స్నేహితులకు పంపిస్తాం..
యూట్యూట్‌లో పెడ తాం అంటూ బ్లాక్‌మెయిలింగ్‌కు దిగుతారు. పరువు పోతుందన్న భయంతో బాధితులు వారు అడిగినంత ఇచ్చుకుంటూ పోతే.. బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యే వరకు వదిలిపెట్టరని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఈ వలలో చిక్కుకుంటే భయపడి డబ్బులు పంపవద్దని, సదరు ఐటీలను వెంటనే బ్లాక్ చేసి, 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయానలి సూచిస్తున్నారు. వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయని చెపుతున్నారు.




