గుర్రపు డెక్క మాటున దోపిడీ?
- వంద కోట్లు దోచుకున్నారు!
చెరువుల ప్రక్షాళనలో మురికి రాజకీయం
మూడు కార్పొరేషన్లలో ఇంజినీర్ల బినామీల దందా
హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 17 (విజయక్రాంతి): నగరంలోని చెరువులను ముంచేస్తున్న గుర్రపు డెక్క ఇప్పుడు కొందరు అధికారులు, కాంట్రాక్టర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. నగరంలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లు జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి పరిధిలో గుర్రపు డెక్క తొలగింపు పేరుతో సుమారు రూ.వంద కోట్ల భారీ కుంభకోణం వెలుగుచూసింది.
చెరువుల ప్రక్షాళన కంటే నిధుల భక్షణే లక్ష్యంగా సాగుతున్న ఈ దందాలో ఇంజినీరింగ్ విభాగం కీలక పాత్ర పోషిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి తమ బినామీలకే టెండర్లు కట్టబెడుతూ ప్రభుత్వ ఖజానాకు కన్నం వేస్తున్నారు.
ముందే ఒప్పందం.. 20 శాతం వాటా
టెండర్ నోటిఫికేషన్ విడుదల కావడానికి ముందే ఇంజినీర్లు, కాంట్రాక్టర్ల మధ్య రహస్య ఒప్పందాలు కుదురుతున్నాయి. పని ఇప్పించినందుకు గాను కాంట్రాక్ట్ విలువలో ఏకంగా 20 శాతం వాటాను ఇంజినీర్లకు ముట్టజెప్పేలా డీల్ కుదుర్చుకుంటున్నారు. ఈ ఒప్పందానికి ఒప్పుకున్న కాంట్రాక్టర్లకు మాత్రమే పనులు దక్కేలా అధికారులు చక్రం తిప్పుతున్నారు.
ఎవరైనా బయటి వ్యక్తులు లేదా అర్హత ఉన్న ఇతర కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేయడానికి వస్తే.. ఇంజినీర్లే నేరుగా రంగంలోకి దిగి వారిని బెదిరిస్తున్నట్లు సమాచారం. ఉప్పల్ జోన్, కాప్రా సర్కిల్ పరిధిలోని నాలుగు చెరువుల్లో ఏడాది పాటు గుర్రపు డెక్క తొలగించే కాంట్రాక్టులో భారీ అవకతవకలు బయటపడ్డాయి. రూ.1.12 కోట్ల విలువైన ఈ పనిని వివేక్ ఇంజినీరింగ్ అనే సంస్థకు కట్టబెట్టారు.
వాస్తవానికి నిబంధనల ప్రకారం సదరు టెండర్‌ను రద్దు చేయాల్సి ఉన్నప్పటికీ, ఇంజినీరింగ్ విభాగం ఉద్దేశపూర్వకంగా అదే సంస్థకు పని అప్పగించి తమ చిత్తశుద్ధిని చాటుకుంది. దీని వెనుక పెద్ద ఎత్తున చేతులు మారాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కూకట్‌పల్లిలో ఏసీబీ అస్త్రంతో బెదిరింపులు
కూకట్‌పల్లి జోన్ పరిధిలో కాంట్రాక్టు దక్కించుకోవడానికి కొందరు కాంట్రాక్టర్లు ఏకంగా అధికారులనే బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. తమకు పని ఇవ్వకపోతే పాత అక్రమాలను బయటపెట్టి ఏసీబీ అధికారులకు పట్టిస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో భయపడిన అధికారులు నిబంధనలను పక్కనబెట్టి వారికే పనులు కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది.
బినామీల రాజ్యం
మూడు కార్పొరేషన్ల పరిధిలో జరుగుతున్న గుర్రపు డెక్క తొలగింపు టెండర్లలో సగానికి పైగా ఇంజినీర్ల బినామీలే దక్కించుకున్నారని సమాచారం. కాగితాల మీద పనులు జరిగినట్లు చూపిస్తూ, క్షేత్రస్థాయిలో నామమాత్రంగా డెక్కను తొలగించి బిల్లులు డ్రా చేసుకుంటున్నారనే ఆరోపణ లు ఉన్నాయి. ఫలితంగా కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అవుతుండగా, చెరువులు మాత్రం మళ్లీ గుర్రపు డెక్కతో నిండిపోతున్నాయి.




