29 June, 2026 | 4:14 AM

ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి

17-04-2026 09:51 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): ఆపదలో ఉన్న ప్రాణాన్ని కాపాడేందుకు ‘గోల్డెన్ అవర్’  అత్యంత కీలకమని, ఆ సమయంలో స్పందిస్తే మృత్యువు నోటి నుండి మనిషిని బయటకు తీసుకురావచ్చని ఇనుగుర్తి ఎస్ఐ గంగారపు కరుణాకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి  మండల కేంద్రంలోని పెద్ద బస్టాండ్ సెంటర్ వద్ద అంబులెన్స్ సేవలు, గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రమాదం జరిగినప్పుడు లేదా అస్వస్థతకు గురైనప్పుడు కాలయాపన చేయకుండా వెంటనే అంబులెన్స్ సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఎండాకాలం తీవ్రత దృష్ట్యా వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, నీరసంగా ఉన్నా లేదా స్పృహ తప్పినా వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించాలన్నారు.సమయం మించిపోయాక ఇచ్చే లక్షల రూపాయల వైద్యం కంటే.. సమయానికి అంబులెన్స్‌లో అందించే ప్రాథమిక చికిత్సే ప్రాణాన్ని నిలబెడుతుంది" అని ఆయన పేర్కొన్నారు.

ఎండలు ముదురుతున్న వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తటపటాయించకుండా ప్రభుత్వ అంబులెన్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎస్ఐ  ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఈఎంటి ప్రభాకర్, పైలెట్ ప్రశాంత్, పోలీసు సిబ్బంది, స్థానిక ప్రజలు, వాహనదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.