నైపుణ్యాలు పెంచుకుని ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవాలి
నిర్మల్ మే 23 (విజయక్రాంతి): ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో శనివారం, కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉద్యోగ సాధనపై ప్రత్యేక కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమలోని నైపుణ్యాలను పెంపొందించుకుని, లభించే ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
పట్టణంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఉద్యోగాలకు ఎంపికైన 40 మంది అభ్యర్థులకు జిల్లా అదనపు కలెక్టర్ చేతుల మీదుగా నియామక ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. జాతీయ స్థాయి యువ దినోత్సవాల్లో పాల్గొన్న 'పాటె మా ప్రాణం' సంగీత అకాడమీ కళాకారులను, జిల్లా నుండి జాతీయ స్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. చిత్రలేఖనం, ఉపన్యాస పోటీల విజేతలకు, సాంస్కృతిక ప్రదర్శనల్లో ప్రతిభ చాటిన చిన్నారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు.






