23 May, 2026 | 9:47 PM

దైనందిన జీవితంలో వ్యాయామానికి కొంత సమయం కేటాయించాలి

23-05-2026 08:29 PM

- జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య

నస్పూర్,(విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో కొంత సమయం వ్యాయామం, యోగకు కేటాయించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. శనివారం కలెక్టరేట్ లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యువజన క్రీడా ముగింపు కార్యక్రమానికి జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి హనుమంతరెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి నీరటి రాజేశ్వరి, ప్రభుత్వ ఐ.టి.ఐ. కళాశాల ప్రిన్సిపల్ రమేష్, ఇతర అధికారులతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళికా కార్యక్రమంలో భాగంగా ఈనెల 18 నుంచి 23 వరకు జిల్లా క్రీడా శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. 18న ఫిట్ & యాక్టివ్ తెలంగాణ, మారథాన్ - ఫిజికల్ లిటరసీ, 19న కెరీర్ & స్కిల్ డెవలప్మెంట్ - ఎం పవర్ స్కిల్స్, ఎం పవర్ ఫ్యూచర్, 20న యూత్ లీడర్ షిప్ సమ్మిట్, 21న ప్లే & పార్టిసిపేట్ - స్పోర్ట్స్ డే, 22న సర్వ్ & సపోర్ట్ - యూత్ ఫర్ క్లీన్ తెలంగాణ, 23న ఉద్యోగ సాధన - కనెక్టింగ్ టాలెంట్ విత్ ఆపర్చునిటీస్ వంటి కార్యక్రమాలను అధికారుల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు.

99 రోజుల కార్యాచరణలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలలో వివిధ జిల్లా శాఖల అధికారులు, క్రీడాకారులు, యువత, విద్యార్థులు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారని తెలిపారు. ప్రజల ఆరోగ్యకర జీవనశైలి, యువతకు ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించడం, మాదకద్రవ్యాల నియంత్రణ, నైపుణ్యాభివృద్ధి, ప్లాస్టిక్ రహిత సమాజం తదితర అంశాలపై చర్చలు, చిత్రలేఖన పోటీలు, సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలు, జ్ఞాపికల అందజేత, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక కార్యక్రమాలు, స్పోర్ట్స్ డే వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని జిల్లాలో అన్ని విభాగాలలో విజయవంతం చేసేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. అనంతరం చిత్రలేఖనం, క్రీడ పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు వంటి అంశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, యువతి యువకులు, విద్యార్థులు, యువజన సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.