18 నుంచి కేబీఆర్ చుట్టూ వన్ వే!
- అధికారికంగా అమలు చేయనున్న పోలీసులు
- వెల్లడించిన సీపీ సజ్జనార్
- వాహనదారులకు కీలక సూచనలు
బంజారాహిల్స్, ఆగస్టు 11(విజయక్రాం తి): కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ప్ర యాణించే వాహనదారులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ముఖ్యమైన ప్రకటన చేశారు. ఆగస్టు 18 నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్ విధానాన్ని అధికారికంగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం బంజారాహిల్స్ లోని టీజి ఐసిసిసి భవనం ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సి పి సజ్జనార్, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ ఇతర అధికారులతో కలిసి కేబీఆర్ పార్క్ చుట్టు పక్కల ట్రాఫిక్ ఆంక్షలు, విధివిధానాలపై పలు సూచనలు చేశారు.
వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా..
హెచ్-సిటీ ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు,అండర్పాస్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి.నిర్మాణ పనుల వల్ల రహదారి వైశాల్యం తగ్గడంతో నిత్యం తీవ్ర ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది. ఈ ఇరుకు రోడ్లపై ఇరువైపులా వాహనాలు రాకపోకలు సాగించడం వల్ల తీవ్ర ప్రయాణ జా ప్యంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూ పిస్తూ, రద్దీని నియంత్రించేందుకు ప్రయాణికుల భద్రతను నిర్ధారించేందుకు ఈ వన్ వే విధానాన్ని నిర్ణయించారు.
రెండు విడతల్లో ప్రయోగాత్మక పరిశీలన..
ఈ నూతన విధానాన్ని శాశ్వతంగా అమలు చేయడానికి ముందు క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేసేందుకు పోలీసులు రెండు విడతల్లో పైలట్ ట్రయల్స్ నిర్వహించారు. ఏప్రిల్ 5న 3 గంటల పాటు మొదటి ట్రయల్, జూన్ 21న 6 గంటల పాటు రెండో ట్రయల్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాల ఫ్లో, జంక్షన్ల వద్ద రద్దీ, లేన్ క్రమశిక్షణను నిశితంగా పరిశీలించిన అధికారులు అవసరమైన సర్దుబాట్లు పూర్తి చేసి ఇప్పుడు వన్-వే విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు.
సజావుగా ప్రయాణం కోసం విస్తృత ఏర్పాట్లు..
వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ పోలీసులు తగిన ఏర్పాట్లు చేశారు. రహదారులపై స్పష్టమైన లేన్ మార్కింగ్లు, లేన్ ఛేంజర్లు, దిశా సూచిక బోర్డులు అందుబాటులోకి తెచ్చారు. కీలకమైన జంక్షన్లలో 24 గంటలూ ట్రాఫిక్ సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. గూగుల్ మ్యాప్స్ వంటి నావిగేషన్ యాప్లలో కొత్త వన్-వే మార్గాలకు అనుగుణంగా మార్పులు చేస్తున్నారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ల సహాయంతో రియల్-టైమ్ ట్రాఫిక్ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తారు.
వాహనదారులు, సందర్శకులకు కీలక సూచనలు..
కొత్త వన్-వే మార్గాలను దృష్టిలో ఉంచుకుని ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని అధికారులు కోరారు. రోడ్డు మార్కింగ్లు, సైన్ బోర్డులు, విధులు నిర్వర్తించే ట్రాఫిక్ పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలన్నారు.అంబులెన్సులు, ఫైర్ ఇంజిన్ల వంటి అత్యవసర వాహనాల కోసం లేన్-2 ద్వారా ఉచిత మార్గాన్ని కల్పించాలన్నారు. కేబీఆర్ పార్క్ వాకర్లు, సందర్శకులు తమ వాహనాలను కేటాయించిన పార్కింగ్ ప్రాంతాల్లోనే నిలపాలని సూచించారు.
రాత్రి వేళల్లో లేదా రద్దీ తక్కువగా ఉన్న సమయంలో కూడా ఎలాంటి పరిస్థితుల్లోనూ రాంగ్-సైడ్ డ్రైవింగ్ చేయకూడదని అధికారులు స్పష్టం చేశారు. రోడ్డు మలుపుల వద్ద, ఇరుకైన మార్గాల్లో లేదా ట్రాఫిక్కు అడ్డంకిగా వాహనాలను పార్క్ చేయకూడదన్నారు.సోషల్ మీడియాలో వచ్చే ధ్రువీకరించని ట్రాఫిక్ వదంతులను నమ్మవద్దు, ఫార్వర్డ్ చేయవద్దని తెలిపారు.అధికారిక సమాచారం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సోషల్ మీడియా ఖాతాలను చూడాలన్నారు. నిర్మాణ పనులు పూర్తి అయ్యేంత వరకు నగర పౌరులు, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలకు కట్టుబడి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.






