12 August, 2026 | 3:20 AM

మణుగూరు మున్సిపాలిటీ.. ఆ గ్రామాలకు శాపం

12-08-2026 01:09 AM
  1. పారిశుద్ధ్య పనులకు అంతరాయమేనా...?
  2. ఉపాధి పనులు లేక తీవ్ర ఇబ్బందులు
  3. మణుగూరుని గ్రామపంచాయతీగా చేయాలని కోర్టులో పిటిషన్
  4. సంవత్సరాలు గడుస్తున్నా కోర్టు తీర్పు రాని వైనం
  5. పాలకులు మారినా... తలరాతలు మారలే..!

మణుగూరు (టౌన్), ఆగస్టు 11, (విజయక్రాంతి): మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో విలీనమైన గ్రామాల ప్రజలకు మున్సిపాలిటీ ఏర్పాటే శాపంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణాభివృద్ధి పేరుతో గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేసినప్పటికీ, ఆయా గ్రామాలకు పూర్తిస్థాయిలో మున్సిపల్ సేవలు అందడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

మున్సిపాలిటీ కేంద్రానికి  రాయి గూడెం, కమలాపురం, అన్నారం, అనంతారం,  గ్రామాలు కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ప్రజలు వివిధ పనుల కోసం పట్టణానికి రావాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో విలీన గ్రామాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. గ్రామాల్లో చెత్త సేకరణ, కాలువల శుభ్రత, దోమల నివారణ వంటి పనులు సక్రమంగా జరగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పట్టణ ప్రాంతాలకు అందుతున్న స్థాయిలో విలీన గ్రామాలకు సేవలు అందడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలకు ప్రత్యేకంగా సిబ్బంది, వాహనాలు, పారిశుద్ధ్య సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఆ దిశగా తగిన చర్యలు శూన్యం. దీంతో ఆయా గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయని పేర్కొంటున్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని, మురుగు కాలువలు పొంగిపొర్లుతున్నా పట్టించుకునే వారు లేరని వాపోతున్నారు. దోమల బెడద పెరిగి సీజనల్ వ్యాధుల భయం వెంటాడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉపాధి పనులకు దూరం..

గ్రామపంచాయతీలుగా ఉన్న సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులు అందుబాటులో ఉండేవని, మున్సిపాలిటీలో విలీనం అనంతరం ఆ అవకాశాలు కోల్పోయామని పలువురు గ్రామీణులు చెబుతున్నారు. కూలి పనులపై ఆధారపడే కుటుంబాలకు ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు. స్థానికంగా పనులు లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణుల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఉపాధి అవకాశాలు కల్పించాలని వారు కోరుతున్నారు.

పంచాయతీ హోదా కోసం న్యాయపోరాటం..

మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గ్రామాలను తిరిగి గ్రామపంచాయతీలుగా మార్చాలన్న డిమాండ్ కూడా కొంతకాలంగా వినిపిస్తోంది. ఈ అంశంపై పట్టణాన్ని గ్రామపంచాయతీగా చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. పిటిషన్ దాఖలు చేసి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు తుది తీర్పు వెలువడకపోవ డంతో ప్రజల్లో అయోమయం నెలకొంది. తీర్పు కోసం ఎదురుచూస్తున్న గ్రామాల ప్రజలకు మరింత కాలం నిరీక్షణ తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

పాలకులు మారినా... తలరాతలు మారలే...

మున్సిపాలిటీకి పాలకవర్గాలు మారుతున్నా విలీన గ్రామాల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఎన్నికల సమయంలో గ్రామాల సమస్యలను పరిష్కరిస్తామని హామీలు ఇస్తున్న నాయకులు, అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. పారిశుద్ధ్యం, డ్రైనేజీ, రహదారులు, వీధి దీపాలు, తాగునీరు వంటి కనీస సౌకర్యాల కోసం ప్రజలు అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోందని అంటున్నారు.

గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయడం వల్ల అభివృద్ధి జరుగుతుందని భావించిన ప్రజలకు ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించడం లేదని స్థానికులు పేర్కొంటు న్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రతి గ్రామానికి సమానంగా నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టాలని కోరుతున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది, వాహనాలను పెంచి ప్రతి గ్రామంలో క్రమం తప్పకుండా చెత్త సేకరణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

ఉపాధి అవకాశాలు కోల్పోయిన గ్రామీణ కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు కల్పించాలని కోరుతున్నారు. కోర్టులో పెండింగ్లో ఉన్న పిటిష్ప త్వరగా తీర్పు వచ్చేలా సంబంధిత వర్గాలు చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు. గామపంచాయతీ హోదా పునరుద్ధరణ సాధ్యమైతే తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. లేకపోతే మున్సిపాలిటీ పరిధిలోనే కొనసాగిస్తూ గ్రామాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు.

ప్రజల సమస్యలను రాజకీయాలకు అతీతంగా పరిష్కరించాల్సిన బాధ్యత పాలకులు, అధికారులపై ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి విలీన గ్రామాల సమస్యలపై సమగ్ర సర్వే నిర్వహించాలని కోరుతున్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించి, పారిశుద్ధ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు. ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు జీవనోపాధి కల్పించే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మున్సిపాలిటీ ఏర్పాటుతో అభివృద్ధి చెందాల్సిన గ్రామాలు సమస్యల వలయంలో చిక్కుకోవడం దురదృష్టకరమని, ఇకనైనా పాలకులు, అధికారులు స్పందించి తమ తలరాత మార్చాలని విలీన గ్రామాల ప్రజలు కోరుతున్నారు.