calender_icon.png 19 July, 2025 | 5:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆన్‌లైన్.. ఆలస్యం!

19-07-2025 12:00:00 AM

  1. భూ భారతి నమోదులో ఇక్కట్లు..
  2. పోర్టల్లో ఎంట్రీకి ఓటీపీ  తప్పనిసరి
  3. క్షేత్రస్థాయిలో ఆటంకాలు.. 
  4. నత్తనడకన ప్రక్రియ
  5. గడువులోపు పరిష్కారం అనుమానమే

సంగారెడ్డి, జూలై 18(విజయక్రాంతి): రెవెన్యూ సదస్సుల్లో అందిన భూ సమస్యలు పరిష్కరించాలంటే భూ భారతి పోర్టల్లో రైతుల వివరాలు ఆన్లైన్  చేయాలి. ఇందుకు ఓటీపీ తప్పనిసరి. అయితే దీనిని చెప్పేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. సాంకేతికంగానూ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఇలాగే కొనసాగితే నిర్దేశిత గడువు ఆగస్టు 14 వరకు పూర్తవడం ప్రశ్నార్థకమే అనే అభిప్రా యం వ్యక్తమవుతుంది.

ఇదీ పరిస్థితి..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి నూతన రెవెన్యూ చట్టం అమల్లో భాగంగా గతనెల 3 నుంచి 20 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించింది. ప్రతీ మండలానికి రెండు ప్రత్యేక బృందాలు నియమించి రెవెన్యూ గ్రామాల్లో రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్నిమండలాల పరిధిలో వేలాది దరఖాస్తులు అందాయి.

వివరాల నమోదు చేపడుతూనే దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చే సి సమస్యలు సత్వ రం పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం తహసీల్దార్లను ఆదేశించింది. ఆ దిశగా దృష్టి సారిం చిన అధికారులు ఇప్పటి వరకు 60 శాతం దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తి చేశారు. మరో 40 శాతం దరఖాస్తుల వివరాలు న మోదు చేయాల్సి ఉంది.

అడ్డంకిగా మారిన ఓటీపీ..

భూ సమస్యలు పరిష్కరించే దిశగా రైతులకు నోటీసులు జారీ చేస్తున్న తహసీల్దార్లు వాటిని పోర్టల్లో ఆన్లైన్ చేస్తున్నారు. వివరాలు నమోదు చేయగానే సంబంధిత రైతుల సెల్ నంబర్కు ఓటీపీ వెళ్తుంది. తదుపరి ప్రక్రియ కొనసాగించాలంటే ఓటీపీ నమోదు తప్పనిసరి. ఇందుకోసం తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది సంబంధిత రైతులకు ఫోన్ చేయగా చాలా మంది ఓటీపీ చెప్పేందుకు నిరాకరిస్తున్నారు. మరికొంత మంది ఫోన్లు స్విచాఫ్ వస్తు న్నాయి.

ప్రస్తుతం సైబర్ నేరాలు జరుగుతున్న క్రమంలో రెవెన్యూ సిబ్బందికి ఇది తలనొప్పిగా మారుతోంది. కార్యాలయ సిబ్బంది నంబర్లు తెలిసి ఉండి, కొంత అవగాహన ఉన్న రైతులు మాత్రమే ఓటీపీ చెబుతున్నారు. ఇలాంటి వారి సమస్యలు పరిష్కారమవుతున్నాయి. ఇక ఫోన్ నంబర్ కు ఆధార్ లింక్ చేసి ఉండకపోవడం, రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండి లిఫ్ట్ చేయకపోవడం వంటి కారణాలు అవరోధంగా మారుతున్నట్లుగా తహసీల్దార్లు చెబుతున్నారు.

వేగంగా సాగాలంటే..

ఓటీపీ సమస్య తొలగి, ప్రక్రియ వేగంగా సాగాలంటే రెవెన్యూ సిబ్బంది రైతులకు అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి. పోర్టల్లో దరఖాస్తులు నమోదు చేసే క్రమంలో సంబంధిత గ్రామ రైతులకు ముందుగానే సమాచారమందించాలి. వారు తహసీల్దార్ కార్యాలయంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. పంచాయతీ కార్యదర్శులకు ఈ సమాచారం తెలియజేసి జీపీ కార్యాలయంలో వారి సెల్ఫోన్లతో అందుబాటులో ఉండి ఓటీపీ చెప్పేలా శ్రద్ధ వహించాలి. 

సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు

భూ సమస్యలపై అందిన దరఖాస్తులను పోర్టల్లో నమోదు చేసేందుకు ఓటీపీ సమస్య తలెత్తుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. పరిష్కరించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా రెవెన్యూ సిబ్బందితో పాటు పంచాయతీ కార్యదర్శు లను ఆదేశించాం. గడువులోపు ప్రక్రియ పూర్తి చేసేలా దృష్టి సారించాం.

 నగేశ్‌గౌడ్, 

అదనపు కలెక్టర్, మెదక్