చిరువ్యాపారులకు ‘ఆన్‌లైన్’ ముప్పు
భారతదేశంలో డిజిటల్ విప్లవం వేగంగా విస్తరిస్తున్న తరుణంలో వినియోగదారుల కొనుగోలు విధానం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు మార్కెట్‌కు వెళ్లి కొనుగోలు చేసే ప్రజలు ఇప్పుడు ఇంట్లో కూర్చొని మొబైల్ ఫోన్ ద్వారా నిమిషాల్లో వస్తువులను ఆర్డర్ చేస్తున్నారు. ఈ మార్పు వినియోగదారులకు సౌకర్యాన్ని కలిగించినప్పటికీ, లక్షలాది చిన్న కిరాణా దుకాణాలు, చిరువ్యాపారుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
ఆన్‌లైన్ సంస్థలు ఆకర్షణీయమైన తగ్గింపులు, క్యాష్‌బ్యాక్‌లు, ఉచిత డెలివరీ, సులభ వాయిదా పద్ధతులతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. స్థానిక దుకాణంలో కంటే తక్కువ ధరకు లభిస్తుండటం వల్ల వినియోగదారులు సహజంగానే ఆన్‌లైన్ వైపు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా చిన్న వ్యాపారుల అమ్మకాలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. మరోవైపు వినియోగదా రులు తక్కువ ధరల కోసం ఆన్‌లైన్ సంస్థలను ఆశ్రయిస్తున్నప్పటికీ, దీర్ఘకాలంలో మార్కెట్‌పై కొన్ని కంపెనీల ఆధిపత్యం ఏర్పడే ప్రమా దం ఉంది.
పోటీ తగ్గిన తర్వాత ధరలను పెంచే అవకాశం కూడా ఉంటుంది. అప్పుడు వినియోగదారులే నష్టపోయే పరిస్థితి రావచ్చు. కాబట్టి మార్కెట్‌లో సమతుల్యత అత్యంత అవసరం. చిన్న వ్యాపారులు కూడా కాలానుగుణంగా మారాలి. డిజిటల్ చెల్లింపులు, వాట్సాప్ ద్వారా ఆర్డర్లు, హోమ్ డెలివరీ, సోషల్ మీడియా ప్రచారం వంటి ఆధునిక పద్ధతులను స్వీకరించాలి.
డిజిటల్ వ్యాపారాల పురోగతి, చిన్న వ్యాపారాల పరిరక్షణ రెండూ సమానంగా కొనసా గినప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఆన్‌లైన్ వ్యాపారాలు ఆధునిక భారతదేశానికి అవసరమే. కానీ, చిన్న దుకాణాలు నిలబడితేనే స్థానిక ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది; స్థానిక ఆర్థిక వ్యవస్థ బలపడితేనే దేశ అభివృద్ధి స్థిరంగా ఉంటుంది.
ఆళవందార్ వేణుమాధవ్, హైదరాబాద్, 8686051752






