సింగీతం చెప్పిన ప్రకృతి పాఠం
ప్రకృతిని మనం కాపాడకపోతే, అది మనల్ని కాపాడదు. ఈ నిజాన్ని మనందరి కళ్లకు కట్టారు 94 ఏళ్ల సినీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. ‘సింగ్ గీతం’తో ఆయన ఒక గొప్ప ప్రయోగం చేశారు. ఆ సినిమాలోని కుబేరపురం మన చుట్టూ ఉంది. హైదరాబాద్‌లో ప్రతి రోజూ కబ్జా అవుతున్న చెరువులు, నేలకొరుగుతున్న చెట్లు, కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న కాలనీలు... ‘కుబేర గోల్డ్‌మైన్స్’కి ప్రతిరూపాలే. ఆ సినిమాలో రేణుకు బంగారం మీద ఆశ ఉంటే, మనకేమో డబ్బు మీద ఆశ.
మరి ఆ శాపం మన తరానికి తగలకుండా ఉండాలంటే.. సినిమాలో ప్రతాప్‌లా మనమూ మారాలి. ఎండిపోయిన బోరుబావి రోదన, మూసీ నది ఆక్రందన, ఉక్కపోతతో విలవిల్లాడే మహానగరం మౌనాన్ని పాటరూపంలో విని మనమూ మారాలి. కోటి మంది ఒక్కో మొక్కను బతికించడం ముఖ్యం. రేపు మనం నీళ్ల కోసం యుద్ధాలు చేయకుండా ఉండాలంటే, ఈ రోజు ప్రతి చుక్కనూ గౌరవించాలి. ఇప్పటికే ఈ ఏడాది కరువు విరియోతాండవం చేస్తుందని పర్యావరణవేత్తలు హెచ్చరికలు చేస్తున్నారు.
ఇలాంటి సమ యంలో ‘సింగ్ గీతం’ సినిమా ఒక మేల్కొల్పు కావాలి. ఈ సినిమాలోని రేణు లా ‘నాకు వచ్చే లాభం ఏంటి?’ అని ఆలోచించడం మానేసి... ‘నేను కొనే ఈ వస్తువు వెనుక ఎంత ప్రకృతి నాశనం ఉంది?’ అని ప్రశ్నించుకుందాం. మన అవసరం తీరడానికి కొంటున్నామా, లేక దురాశతో కొంటున్నామా? అని ఆలోచిస్తే చాలు. మనం వాడే ప్రతి ప్లాస్టిక్ కవర్, మనం వృథాచేసే ప్రతి మెతుకు కుబేరపురం చెట్టు మీద పడిన గొడ్డలి వేటే. మన కథ కూడా ఈ సినిమాలాగా సుఖాంతం కావాలంటే, మనం కూడా ఏకం కావాలి.
ఈ భూమి మన తాతముత్తాతల నుంచి సంక్రమించిన ఆస్తి కాదు. మన పిల్ల ల దగ్గర నుంచి అప్పుగా తెచ్చుకున్నది. ఆ అప్పు వడ్డీతో సహా తీర్చే బాధ్యత మనదే. లేకపోతే రేపటి తరానికి మనం బంజరు భూమిని మాత్రమే మిగులుస్తాం. వాళ్లు పాడే పాటలో సంతోషం ఉండదు, శాపమే ఉంటుంది. ఒక్క అడుగుతో మొదలుపెడదాం. ఎందుకంటే కుబేరపురం శాపం కథగా మిగిలిపోవాలి, చరిత్రగా మారకూడదు.
భవిత, హైదరాబాద్






