26 April, 2026 | 3:34 PM

కులగణన నమోదుకు అవకాశం

26-04-2026 01:46 PM

సెన్సుస్ నమోదుకు వచ్చే అధికారులకు సహకరించండి

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్‌నగర్,(విజయక్రాంతి): నగరంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన “హ్యాపీ సండే” కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి  ముఖ్య అతిథిగా పాల్గొని సెన్సుస్ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా యాప్ ద్వారా సెన్సుస్ వివరాలను నమోదు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో సెన్సుస్ కార్యక్రమం ప్రారంభమైందని తెలిపారు. ఆధునిక టెక్నాలజీ వినియోగంతో సెన్సుస్ ప్రక్రియ మరింత సులభతరం అయిందని, గతంలో రెండేళ్లకు పైగా పట్టిన ప్రక్రియ ఇప్పుడు ఆన్‌లైన్, యాప్ ద్వారా కొన్ని నిమిషాల్లోనే పూర్తవుతోందని వివరించారు.

ప్రజలు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే సౌకర్యం కల్పించడం ద్వారా పారదర్శకత మరియు వేగం పెరిగిందన్నారు. దేశ అభివృద్ధికి సెన్సుస్ ఎంతో కీలకమని, ఖచ్చితమైన డేటా ఆధారంగా ప్రభుత్వాలు సమర్థవంతమైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రణాళికలు రూపొందించగలవని ఆయన పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ నగరంలో గత కొన్నేళ్లలో జనాభా వేగంగా పెరిగి దాదాపు మూడు లక్షలకు చేరుకుందని, ఈ నేపథ్యంలో తాగునీరు, విద్య, రోడ్లు, డ్రైనేజ్ వంటి మౌలిక వసతుల అభివృద్ధికి సెన్సుస్ డేటా అత్యంత అవసరమన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేసిన డిమాండ్ మేరకు ఈ సెన్సుస్ లో కులగణన వివరాలు నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగిందని తెలిపారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర వర్గాల సమగ్ర సమాచారం అందుబాటులోకి వస్తే సమాజంలో ఉన్న వెనుకబాటుతనం, విద్యా స్థాయి, జీవన ప్రమాణాలపై స్పష్టమైన అవగాహన ఏర్పడుతుందని పేర్కొన్నారు. ప్రజలు సెన్సుస్ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొని తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేసుకోవాలని, అధికారులు ఇంటికి వచ్చినప్పుడు సరైన సమాచారం అందించాలని లేదా స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సెన్సుస్ విజయవంతం కావడానికి ప్రజలందరి సహకారం అత్యంత అవసరమని తెలిపారు.  ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, మేయర్  గుమ్మాల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, అదనపు కలెక్టర్ శ్రీమతి హరిప్రియ, మున్సిపల్ కమిషనర్ రామాంజనేయులు రెడ్డి, కార్పొరేటర్లు  తదితరులు పాల్గొన్నారు.