రేవంత్‌కు ఓటమి భయం

28-04-2024 01:39:11 AM

l ఓడిపోతే పదవి నుంచి దించేస్తారని ఆందోళన 

l రేవంత్.. బండి సంజయ్‌పై డమ్మీని పెట్టారు 

l మల్లారెడ్డి కామెంట్స్ పరిశీలిస్తున్నం 

l మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

కరీంనగర్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి మాటల్లో ఓటమి భయం కనబడుతున్నదని, పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతే తనను పదవి నుంచి దింపేస్తారన్న భయం వెంటాడుతోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం రాత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి బీ వినోద్‌కుమార్‌తో కలసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. ఆరు గ్యారెంటీల గురించి, పాలన గురించి రేవంత్ మాట్లాడటం లేదని, ‘అయితే తిట్టు, లేదంటే ఒట్టు’.. ఇదే రేవంత్ సీఎం అయ్యాక చేస్తున్న పని అని ఎద్దేవా చేశారు.

దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నాడని మండిపడ్డారు. బీజేపీతో కుమ్మక్కై దొంగే దొంగ అన్నట్టుగా రేవంత్ వ్యవహరిస్తున్నాడని ధ్వజమెత్తారు. బలహీనమైన అభ్యర్థిని పెడుతూ పరస్పరం సహకరించుకున్నారని ఆరోపించారు. రిజర్వేషన్లు పెంచాలని మేము అంటే రిజర్వేషన్లు తీసేసుందుకు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నామని అబద్ధాలు మాట్లాడుతున్నాడని అన్నారు. కేసీఆర్ లాంటి నాయకుడు ఉండగా హిందూ ముస్లింల ఆస్తులకి ఇబ్బందులు ఉండవని చెప్పారు. 

రేవంత్ వచ్చాక ధరలపై అదుపు లేకుండా పోయిందని.. పప్పు, నూనె ధరలు, సిమెంట్ ధరలు ఇలా అన్ని రంగాల్లో ధరలు పెరిగిపోయాయని దుయ్యబట్టారు. అటు కేంద్రంలో బీజేపీ అలానే ఉంది.. ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్‌లోనూ అలానే ఉన్నదని చెప్పారు. బీసీలపై ప్రేమ ఉన్నట్టు రేవంత్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉన్నదని అన్నారు. బీసీలకి అత్యధిక టికెట్లు ఇచ్చింది బీఆర్‌ఎస్ అయితే బీసీలకి అన్యాయం చేస్తోంది రేవంత్‌రెడ్డి అన్నారు. కరీంనగర్ పార్లమెంట్‌లోనూ బీజేపీకి రేవంత్ సపోర్ట్ చేస్తున్నాడని డమ్మీ అభ్యర్థిని పెట్టి బీజేపీ గెలవాలన్న రేవంత్ ఆలోచన కరీంనగర్ ప్రజలు తెలుసుకున్నారని చెప్పారు. రేవంత్‌రెడ్డి ఓ ఫైటర్ అని బండి సంజయ్ కితాబు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.

రేవంత్ బండి సంజయ్‌ని పొగుడుతారు.. బండి రేవంత్‌ని పొగిడారు.. బీజేపీ కాంగ్రెస్ దోస్తీకి ఇదే కదా నిదర్శనం అన్నారు. బడే బాయి అంటూ రేవంత్‌రెడ్డి మోదీని పొగిడినప్పుడు.. బండి సంజయ్ రేవంత్‌రెడ్డిని పొగిడితే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. -కుమ్మక్కు రాజకీయాలను కరీంనగర్ ప్రజలు తిప్పికొడుతారని అన్నారు. మల్కాజిగిరిలో మల్లారెడ్డి కామెంట్స్‌పై స్పందించిన హరీశ్‌రావు.. ఆ కామెంట్స్‌పై పరిశీలన ఉంటుందని చెప్పారు. ఆయన సందర్భోచితంగా మాట్లాడారనే అనుకుంటున్నామని తెలిపారు. పరిశీలిన తరువాత చర్యలుంటాయి అని వెల్లడించారు.