టెలిగ్రామ్ ఫౌండర్ పావెల్ దురోవ్ అరెస్ట్
- యాప్‌పై నియంత్రణ లేకపోవడంపై యూరప్ దేశాల అభ్యంతరం
- అసాంఘిక కార్యకలాపాలకు వేదికైందని ఆరోపణ
- ఎట్టకేలకు దురోవ్‌ను పట్టుకున్న ఫ్రాన్స్ పోలీసులు
పారిస్, ఆగస్టు 25: టెలిగ్రామ్ యాప్‌పై నియంత్రణ లేకపోవడంతో దాని ఆధారంగా మాదక ద్రవ్యాల రవాణా, సైబర్ నేరాలు, వ్యవస్థీకృత నేరాలు పెరుగుతున్నాయనే ఆరోపణలపై శనివారం పారిస్ పోలీసులు యాప్ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ దురోవ్‌ను అరెస్టు చేశారు. ఆయన అజర్‌బైజాన్ నుంచి ప్రైవేటు జెట్‌లో బయల్దేరి ఫ్రాన్స్‌లోని లే బోర్గట్ విమానాశ్రయానికి చేరుకోగానే పట్టుబడ్డారు. ఆదివారం దురోవ్‌ను పోలీసులు న్యాయస్థానం ఎదుట హాజరు పరిచారు. రష్యాలో జన్మించిన దురోవ్ అక్కడే పుట్టి పెరిగారు. అక్కడే చదువుకున్నారు. 2013లో టెలిగ్రామ్ యాప్‌ను ప్రారంభించారు.
ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో దురోవ్ 2014లో రష్యాను విడిచిపెట్టారు. అనేక దేశాలకు మకాం మారుస్తూ 2017లో దుబాయ్ చేరుకున్నారు. 2021లో ఫ్రాన్స్‌కు చేరుకుని అక్కడ ఆ దేశ పౌరసత్వాన్ని పొందారు. టెలిగ్రామ్‌లో సర్క్యులేట్ అవుతున్న కంటెంట్‌పై నియంత్రణ లేకపోవడంతో యాప్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయని దశాబ్దం నుంచి ఆరోపణలు ఉన్నాయి.
ముఖ్యంగా యూరప్ ఖండంలో స్మగ్లర్లు మాదక ద్రవ్యాల రవాణా నిర్వహిస్తుండడం, సైబర్ నేరగాళ్లు సాధారణ పౌరులకు గాలం వేయడం వంటి పనులకు టెలిగ్రామ్‌ను వినియోగిస్తుండడంతో ఆయా దేశాలకు యాప్ తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ ప్రభుత్వం చొరవ తీసుకుని ఎట్టకేలకు దురోవ్‌ను అరెస్టు చేసింది. మరోవైపు దురోవ్‌ను అరెస్ట్ చేయడం భావ ప్రకటనా స్వాతంత్య్రాన్ని తొక్కివేయడమేనని యూరప్ వ్యాప్తంగా అనేక ప్రజాసంఘాలు అభ్యంతరం తెలుపుతుండడం గమనార్హం.






